టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికంపై టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏ హీరో ఎంత తీసుకుంటున్నాడు? అనే విషయంపై మళ్లీ లెక్కలు వేసుకోవడం మొదలెట్టారు అభిమానులు. టాలీవుడ్ లో దశాబ్దాల తరబడి నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నారు చిరంజీవి. మెగాస్టార్ గా అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుడు ఆయనే. రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలకు బ్రేక్ ఇచ్చేంత వరకూ. పారితోషికంలో ఆయనదే రికార్డు. అయితే.. ఆ రికార్డుని మహేష్, ప్రభాస్ లాంటి వాళ్లు బ్రేక్ చేసేశారు. `సరిలేరు నీకెవ్వరు` సినిమా కోసం మహేష్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాక్.
అయితే ఆచార్య కోసం చిరు కూడా 50 కోట్లే పారితోషికం అందుకున్నాడట. ఆ విధంగా.. మహేష్ రికార్డు సమం చేసినట్టే. అయితే.. వీరిద్దరి కంటే ప్రభాస్ పారితోషికమే ఎక్కువట. తాజాగా ప్రభాస్ పారితోషికం 100 కోట్లకు చేరిందని టాక్. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. అందుకు గానూ.. 100 కోట్ల పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇది వరకు తెలుగులో 100 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా నిర్మించడమే గగనం. భారీ రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఓ హీరోకి 100 కోట్ల పారితోషికం ఇస్తున్నామంటే.. తెలుగు సినిమా ఎదిగినట్టే. మరి ప్రభాస్ రికార్డుని ఎవరు బద్దలు కొడతారో చూడాలి.