తారాగణం: అంజలి, దీపక్, సప్తగిరి, జేపీ
బ్యానర్: శ్రీ విజ్ఞేశ్ కార్తీక్ సినిమా
సంగీతం: సెల్వ-స్వామి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: రెహమాన్-శ్రీధర్ గంగపట్నం
రచన-దర్శకత్వం: అశోక్ జీ
అంజలి నటించిన గీతాంజలి తో హారర్ కామెడీ సినిమాలకు పిచ్చ క్రేజ్ వచ్చేసింది. తక్కువ పెట్టుబడి - ఎక్కువ రాబడి... అనే కాన్సెప్ట్ ఈ జోనర్‌కి బాగా వర్కవుట్ అవుతుంది. కాకపోతే... ఏ సినిమా జాక్ పాట్ కొడుతుందో చెప్పలేం. గీతాంజలి తరవాత అంజలి మరోసారి హారర్ జోనర్ టచ్ చేయలేదు. అందుకే.... చిత్రాంగదలో అంజలి నటిస్తోంది అనగానే ఆ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని.. చిత్రాంగద ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?? గీతాంజలి తరవాత అంజలి ఖాతాలో హిట్ చేరినట్టా, కాదా??
* కథ ఎలా సాగిందంటే...
చిత్రంగద (అంజలి) చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. సాటి అమ్మాయిలంటే తనకు వ్యామోహం. దానికి తోడు చిత్రాంగదకు ప్రతీ రోజూ ఓ కల వస్తుంటుంది. ఆ కలలో ఓ హత్య కనిపిస్తుంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు. చివరికి ఆ హత్య అమెరికాలో నిజంగానే జరిగిందని, చనిపోయిన ఆ వ్యక్తి ఓ వజ్రాల వ్యాపారి అని తెలుస్తుంది. ఆ కథేంటో తెలుసుకొందామని చిత్రాంగద అమెరికా వెళ్తుంది. అక్కడ ఏం జరిగింది? చిత్రంగదకు కలలో ఆ హత్య ఎందుకు కనిపిస్తోంది?? అసలు చిత్రాంగద విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తోంది? అనేదే ఈ సినిమా కథ.
* ఎవరెలా నటించారంటే...
అంజలి చుట్టూ నడిచే కథ ఇది. కాకపోతే.. అంజలిని చూడ్డమే కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. బాగా లావైపోయింది. మగరాయుడులా నటించే సన్నివేశాలు ఏమాత్రం రక్తి కట్టలేదు. దీపక్‌ది చిన్న పాత్రే. కానీ బాగా చేశాడు. సప్తగిరి కామెడీ ఏమాత్రం పండలేదు. జేపీ నటన ఆకట్టుకొంటుంది. మిగిలినవాళ్ల పాత్రలకు అంత ప్రాముఖ్యం లేదు.
సాంకేతికంగా చూస్తే దర్శకుడు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యాడు. విషయం ఉన్న కథే. కానీ.. దాన్ని తెరపై చూపించడంలో దర్శకుడు తేలిపోయాడు. కథలో అప్ అండ్ డౌన్స్ చాలా కనిపిస్తాయి. బాల్ రెడ్డి కెమెరాపనితనం ఓకే అనిపిస్తుంది. సినిమాని ఉన్నంతలో క్వాలిటీగా తీశారు.
* ఎలా తీశారంటే...?
థ్రిల్లర్ లక్షణాలు పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఆసక్తిరకమైన కథనే రాసుకొన్నాడు దర్శకుడు. అయితే... దాన్ని అంతే ఆసక్తిగా తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఇదో సైకో థ్రిల్లర్. అందులో కామెడీ, హారర్.. ఇలా రకరకాల అంశాల్ని మిక్స్ చేయడం వల్ల కథలో ఫ్లేవర్ దెబ్బతింది. సెకండాఫ్‌లో గానీ కథ మొదలవ్వదు. ఈలోగా నానా సన్నివేశాల్ని ఇరికించి కథని కంగాళీ చేశాడు. వజ్రాల వ్యాపారి హత్య, తన కథ.. చిత్రాంగద వెరైటీ ప్రవర్తన ఇవన్నీ ఆసక్తి కలిగించేవే. అయితే... వాటి మధ్య ఇరికించిన సన్నివేశాలు మాత్రం అంత ఆకట్టుకోలేదు. దానికి తోడు... హారర్ అనే ఎలిమెంట్‌ని అనవసరంగా జోడించారు. అంజలి దెయ్యమా, కాదా? అంటూ కన్‌ఫ్యూజ్ చేసి, కథని పక్కదోవ పట్టించాడు దర్శకుడు. సప్తరిగితో తెరకెక్కించిన కామెడీ ట్రాక్ ఏమాత్రం నవ్వించలేదు. కొన్ని సన్నివేశాలు చూస్తే దర్శకుడు బేసిక్స్ మర్చిపోయాడేమో అనిపిస్తుంది. పతాక సన్నివేశాలే అందుకు అతి పెద్ద ఉదాహరణ. పునర్జన్మలు, ఆత్మకథ, దెయ్యం, సైకాలజీ.. ఇలా రకరకాల అంశాల్ని కథలో జోడించాలని చూసిన దర్శకుడు బాగా ఇబ్బందిపడ్డాడు, ప్రేక్షకుల్ని ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కొన్ని పాత్రలపై ముందు నుంచీ అనుమానం కలిగేలా చేశారు. కాకపోతే.. అలాంటి సన్నివేశాలన్నీ తేలిపోయాయి. ఆహా.. బాగా తీశారు అనిపించుకొనే సన్నివేశం ఈసినిమాలో ఒక్కటంటే ఒక్కటీ ఉండదు. ఇక.... ఫలితం గురించి ఏం మాట్లాడుకొంటాం?? సినిమా నిడివి కూడా దాదాపు రెండున్నర గంటలు. అనవసరమైన సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. అవే.. కథ టెంపోని పాడు చేశాయి.
* ప్లస్ పాయింట్స్
+ టైటిల్
* మైనస్ పాయింట్స్
- మిగిలినవన్నీ
* ఫైనల్ వర్డిక్ట్ : చిత్రహింస
యూజర్ రేటింగ్: 1/5
రివ్యూ బై శ్రీ