ఎంచుకొన్న పాత్ర కోసం గొడ్డులా కష్టపడడంలో ముందు వరుసలో ఉంటాడు చియాన్ విక్రమ్. 'ఐ' సినిమా కోసం విక్రమ్ చేసిన రిస్క్ అంతా ఇంతా కాదు. బరువు తగ్గి, మళ్లీ పెరిగి... చివరికి తన ఆరోగ్యం మీదకు తెచ్చుకొన్నాడు. సినిమా హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒళ్లు హూనం చేసుకొంటాడు. అయితే అందుకు తగిన ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. విక్రమ్ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. తన కష్టమే తప్ప, దానికి తగ్గ ఫలితం అందడం లేదు. అయినా విక్రమ్ ఏం మారలేదు. ఇప్పటికీ అదే రిస్క్. 'తంగలాన్' చిత్రం కోసం విక్రమ్ మళ్లీ రిస్క్ చేశాడు. ఈ సినిమా కోసం ఏకంగా 35 కిలోల బరువు తగ్గాడు. తంగలాన్ పోస్టర్లు చూస్తే మతి పోతోంది ఒకొక్కరికీ. అసలు చూస్తోంది విక్రమ్‌నేనా? అనే అనుమానం వెంటాడుతోంది. తన మేకొవర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. సెట్లో విక్రమ్ పడిన కష్టం చూసి దర్శకుడు పా.రంజిత్ కూడా కళ్లనీళ్లు పెట్టుకొన్నాడంటే అర్థం చేసుకోవొచ్చు. మరి ఈసారైనా విక్రమ్ కష్టానికి తగిన హిట్ దొరుకుతుందా, లేదా? అనేదే పెద్ద ప్రశ్న.
కాకపోతే... పా.రంజిత్ పై నమ్మకం పెట్టుకోవొచ్చు. తన నుంచి ఇప్పటి వరకూ డీసెంట్ సినిమాలే వచ్చాయి. అవార్డ్ విన్నింగ్ స్టఫ్ ఇవ్వడం రంజిత్ కు అలవాటు. తన నుంచి ఓ సినిమా వస్తోందంటే విమర్శకులు అలెర్ట్ అయిపోతారు. ఈసారి కూడా పా.రంజిత్ గొప్ప సినిమా తీశాడని టెక్నీషియన్లు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రీసెంట్ గా చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఓ ట్వీట్ చేశాడు. ఓ అద్బుతమైన సినిమా రాబోతోందని, ఇండియన్ సినిమా కొత్త రికార్డులు లిఖించుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కబురు పంపాడు. జీవీ ట్వీట్ తో చియాన్ అభిమానులకు కాస్త నమ్మకం వచ్చింది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఆ రోజు తెలుగు నుంచి కూడా జోరుగా సినిమాలు వస్తున్నాయి. మరి తెలుగులో తంగలాన్ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకొంటుందో చూడాలి.