ఈ రోజుల్లో ఎలాంటి హడావుడీ లేకుండా ఓ చిన్న సినిమా రావడం, అది బాక్సాఫీసు దగ్గర నిలబడడం.. మామూలు విషయాలు కాదు. పెద్ద సినిమాల పోటీని తట్టుకుంటూ, పబ్లిసిటీ ట్రిక్కుల్ని దాటుకుంటూ, ప్రేక్షకుల మన్ననలు పొందిందంటే - అది గొప్ప విషయమే. `చూసీ చూడంగానే` సినిమా విషయంలో ఇదే జరిగింది. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అయిన సినిమా ఇది. శేష సింధు దర్శకురాలు.
జనవరి 31న విడుదలైంది. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో ఉండగానే.. రాజ్ కందుకూరి ధైర్యం చేసి ఈ సినిమాని విడుదల చేశారు. అయితే వసూళ్లు మాత్రం మిన్నగానే ఉన్నాయి. తొలి వారాంతంలో 1.8 కోట్లు (గ్రాస్) దక్కించుకోగలిగింది. ఓ చిన్న సినిమాకు, తొలి వారాంతంలో ఈ స్థాయి వసూళ్లు రావడం గ్రేటే అనుకోవాలి. రాజ్ కందుకూరి ట్రాక్ రికార్డు, ఆయన సంస్థ నుంచి వచ్చే సినిమా క్వాలిటీని దృష్టిలో ఉంచుకున్న బయ్యర్లు మంచి రేట్లకే ఈ సినిమాని కొన్నారు. శాటిలైట్, డిజిటల్ రూపంలో మంచి మొత్తమే గిట్టుబాటు అయ్యే ఛాన్సుంది. ఏ విధంగా చూసినా నిర్మాతగా రాజ్ కందుకూరికి సంతృప్తినిచ్చే సినిమానే ఇది. ఇటు నిర్మాతగానే కాదు, అటు తండ్రిగానూ ఆయన ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉండొచ్చు.