నర్తన శాల లాంటి ఫ్లాప్ తరవాత నాగశౌర్య నుంచి వచ్చిన సినిమా `అశ్వద్ధామ`. ఈ సినిమానీ సొంత బ్యానర్‌లోనే తెరకెక్కించాడు నాగశౌర్య. తన మార్కెట్ కి మంచి భారీగా ఖర్చు పెట్టాడు. అయితే బాక్సాఫీసు దగ్గర మాత్రం ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. ఈ సినిమాలో విషయం లేదని రివ్యూలు తేల్చేశాయి. కానీ చిత్రబృందం మాత్రం తొలి మూడు రోజుల్లోనూ 10.35 కోట్లు వచ్చేశాయని, సినిమా పెద్ద హిట్టయిపోయిందని పోస్టర్లు వేసేసుకుంటోంది. ఈ సినిమాకి కొన్ని చోట్ల వసూళ్లు బాగున్నాయి.
ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో బాగానే టికెట్లు తెగుతున్నాయి. కానీ.. చిత్రబృందం చెప్పినన్ని వసూళ్లు వచ్చాయా అంటే అది అనుమానమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి దాదాపు 6 కోట్ల వరకూ గ్రాస్ రావొచ్చని, షేర్ 3.5 కోట్ల లోపు ఉండొచ్చని అంటున్నారు. ఈ సినిమాకి దాదాపు 10 కోట్లు ఖర్చయ్యింది. శాటిలైట్ రూపంలో రూ.3 కోట్లు వచ్చాయి. అంటే.. బ్రేక్ ఈవెన్ రావడం కష్టమే అన్నమాట.