తెలుగులో కథానాయికల కొరత చాలా ఉంది. మరీ ముఖ్యంగా యువ హీరోలతో సినిమా అనగానే... కథానాయికల్ని వెదికి పట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. స్క్రీన్ టెస్టులు, టెస్ట్ షూట్‌లు చేసి, ఎంచుకున్నా, చాలామంది ఒక్క సినిమాకే పరిమితం అయిపోతున్నారు. కానీ వర్ష బొల్లమ్మని చూస్తే మాత్రం కచ్చితంగా కొంతకాలం నిలదొక్కుకుంటుందన్న నమ్మకం కలుగుతోంది. `చూసీ చూడంగానే` తన తొలి తెలుగు సినిమా. ఈ సినిమా విడుదల కాకమునుపే రెండు సినిమా అవకాశాల్ని చేజిక్కించుకుంది. ఇక `చూసీ చూడంగానే` హిట్టయితే - వర్ష పెద్ద హీరోల దృష్టిలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్ కందుకూరి నిర్మాతగా, ఆయన తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా వర్ష చెప్పిన సంగతులు.
* ఈ సినిమాకి ఎలా ఎంపికయ్యారు?
- రాజ్ కందుకూరి సార్, శేష సింధు మేడమ్ నా `96` సినిమా చూశారు. అందులో నా పాత్ర వాళ్లకు బాగా నచ్చింది. ఆ తరవాత స్క్రీన్ టెస్ట్ చేశారు. సంతృప్తికరంగా అనిపించడంతో ఈ సినిమా కోసం ఎంచుకున్నారు.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నేనో డ్రమ్మర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా కనిపించనున్నాను. నిజానికి ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు నాకే కన్‌ఫ్యూజన్ ఉండేది. నేను ఆ పాత్రని పోషించగలనా? లేదా? అనిపించింది. ఇది వరకు చేసినవన్నీ సాఫ్ట్ పాత్రలే. అందుకే భయపడ్డా. కానీ రాజ్‌సార్ కి నాపై నమ్మకం ఎక్కువ. అందుకే చేయగలిగాను.
* 96 కాకుండా ఎన్ని సినిమాల్లో నటించారు?
- రెండు తమిళ సినిమాలు చేశాను. మలయాళంలో మూడు సినిమాల్లో నటించాను. కథానాయికగా ఇదే నా తొలి తెలుగు సినిమా. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేస్తున్నారు. తమిళంలో నేను పోషించిన పాత్ర నే తెలుగులోనూ చేశాను. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నాను.
* చూసీ చూడంగానే కథ వినగానే ఏమనిపించింది?
- స్క్రిప్టు విన్నప్పుడు నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది అనిపించింది. స్పేస్ మాత్రమే కాదు, బరువు కూడా ఉంది. అందుకే థ్రిల్ ఫీలయ్యాను. హీరోయిన్‌కి స్పేస్ ఉన్న పాత్రలు చాలా తక్కువగా వస్తుంటాయి. నాకు ఆ అవకాశం తొలి సినిమాతోనే దక్కడం హ్యాపీ.
* నటన అంటే ప్రేమ ఎప్పటి నుంచి? మీరేం చదువుకున్నారు?
- మూడేళ్ల వయసు నుంచీ నటనపై ప్రేమ పెంచుకున్నాను. మైక్రో బయాలజీ పూర్తి చేశాను. కాలేజీ రోజుల్లో స్టేజీపై నటించాలని చాలా అనుకున్నా. అప్పుడు నాకు ఆ అవకాశం రాలేదు.
* మహిళా దర్శకులు సినిమాలు చేస్తే, కథానాయికల పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అంటారు. అది మీకు కలిసొచ్చిందా?
- శేష.. టామ్ బోయ్‌లాంటిది. తనని చూస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు మహిళా దర్శకులు అనే ఫీల్ రాలేదు. కానీ సెట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మాటలు రాసిన పద్మావతి ఓ అమ్మాయే. ప్రొడక్షన్ డిజైనర్ కూడా అమ్మాయే. అమ్మాయిలకు సంబంధించిన చిన్న చిన్న ఎమోషన్స్‌ని శేష బాగా చూపించింది.
* డ్రమ్మర్‌గా నటించేందుకు శిక్షణ ఏమైనా తీసుకున్నారా?
- డ్రమ్మిండ్ చాలా కష్టం. బేసిక్స్ తెలుసుకోకపోతే నటించడం ఇంకా కష్టం. అందుకే ఓ బ్యాండ్ దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాను.
* మీరు నటి అయ్యాక స్నేహితుల రియాక్షన్ ఎలా ఉంది?
- సినిమాల్లో నటించడం మొదలెట్టాక కొత్తగా స్నేహితులెవరూ తయారు కాలేదు. కాలేజీలో స్నేహితులే ఇప్పటికీ నాతో ఉన్నారు. వాళ్లకు ఎలాంటి మొహమాటం లేదు. నా పని, నటన నచ్చకపోతే విమర్శిస్తూనే ఉంటారు.
* శివకు ఇదే తొలి సినిమా కదా? తనకు ఎలాంటి సలహాలిచ్చారు?
- నేనెప్పుడూ తనని న్యూ కమర్ అనుకోలేదు. పైగా తనే నాకు కొన్ని సలహాలు ఇచ్చేవాడు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కళ్లని బాగా బ్లింక్ చేసేదాన్ని. కానీ.. అలా చేయం వల్ల ఎక్స్‌ప్రెషన్స్‌ని సరిగా క్యాప్చర్ చేయలేరు. అందుకే అసలు కళ్లని బ్లింక్ చేయొద్దు అని సలహా ఇస్తుంటారు. నేనిచ్చే ఏకైక సలహా అదే. శివకి కూడా అదే చెప్పా.
* నటుడిగా శివ ఎలా చేశాడు?
- తనలో చాలా అమాయకత్వం, ఫ్రెష్ నెస్ ఉంది. అది నాకు ఇష్టం. తను చాలా అంకిత భావం ఉన్నవాడు. నిర్మాత మా నాన్నే కదా అనుకోలేదు. క్రమశిక్షణతో పనిచేస్తాడు.
* ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీనా?
- ట్రైలర్ చూస్తే ఇది రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు. కానీ అలా ఏమీ ఉండదు. దానికి మించి లేయర్స్ సినిమాలో ఉంటాయి. అది సినిమా చూశాక తెలుస్తుంది.
* అటు విజయ్ తో నటించారు, ఇప్పుడు కొత్తవాళ్లతోనూ చేస్తున్నారు. మీకు తేడా ఏం కనిపించింది?
- తమిళంలో విజిల్ చేశాను. విజయ్ సార్ సెట్లో చాలా రిజర్వ్డ్‌గా ఉండేవారు. అస్సలు మాట్లాడరు. కానీ కెమెరా ముందుకు వస్తే ఎక్కడ లేన ఎనర్జీ వస్తుంది. అది నాకే చాలా షాకింగ్‌గా అనిపించేది. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. కొత్తవాళ్లలో కూడా ఏదో ఓ స్పార్క్ ఉంటుంది. వాళ్ల నుంచి కూడా ఏదో విషయం నేర్చుకోవొచ్చు.
* తెలుగు పరిశ్రమ ఎలా వుంది? మీ ప్రాధాన్యం ఏ భాషకి?
- ఈ సినిమాకి మాత్రం ఓ కుటుంబంలా పనిచేశాం. మన, పర తేడా నాకు తెలీలేదు. నా పాత్ర చాలా ముఖ్యం. కథ నచ్చాలి. నా పాత్ర బాగుండి, సినిమాలో నా పాత్రకు లేకపోతే అలాంటి సినిమా చేయలేను. తెలుగు, తమిళం అంటూ ఏమీ లేదు. నాకు ఎక్కడ మంచి పని దొరికితే అక్కడ చేస్తా.
* ఓకే ఆల్ ద బెస్ట్
- థ్యాంక్యూ...