శతమానం భవతి అంటూ... ఈ సంక్రాంతికి ఓ సూపర్ హిట్ ఇచ్చాడు సతీష్ వేగ్నేశ. ఈ దర్శకుడి తదుపరి సినిమా కూడా దిల్‌రాజు బ్యానర్‌లోనే ఖరారైంది. ఈసారి అక్కినేని మల్టీస్టారర్‌కి సతీష్ స్కెచ్ వేశాడని, నాగార్జున - నాగచైతన్యల కోసం ఓ కథ సిద్దం చేశాడని వార్తలొచ్చాయి. వీటిపై దిల్‌రాజు కూడా స్పందించాడు. ''అవును... మనం తరవాత నాగ్, చైతూ కలసి నటించబోతున్నారు. మా బ్యానర్‌లో తప్పకుండా ఓ సినిమా చేస్తారు'' అని క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో అక్కినేని అభిమానులు సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు ఈ ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టేశాడు నాగార్జున. అసలు ఇలాంటి ప్రతిపాదన ఏదీ తన వరకూ రాలేదని, తాను కూడా ఈ న్యూస్ కొత్తగా వింటున్నానని బాంబు పేల్చాడు నాగ్. నిజంగానే.. నాగ్ వరకూ ఈ ప్రాజెక్టు వెళ్లలేదా? దిల్ రాజు అత్యుత్యాహంతో ముందుగానే ఈ కాంబినేషన్‌ని మీడియాకు లీక్ చేశాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాస్త లోతుగా ఆలోచిస్తే నాగచైతన్య మరో రెండేళ్ల వరకూ బిజీనే. నాగ్ చేతిలో.. రాజుగారి గది 2 సినిమా ఉంది. ఇది పూర్తయితే గానీ, నెక్ట్స్‌సినిమా ఏంటన్నది తెలీదు. సతీష్‌ని అప్పటి వరకూ ఆగమనడం కూడా కరెక్ట్ కాదు. సో... ఈ ప్రాజెక్టుకు టైమ్ పట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నాగ్ మాటల్ని బట్టి చూస్తే.. ఈ మల్టీస్టారర్ లేకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.