డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా అంటేనే మాస్ ప్రేక్షకులు మంచి కిక్ ఇచ్చే సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే పూరి ఇంకాస్త డోసు పెంచి తీసిన మాస్ మసాలా యాక్షన్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎనర్జిటిక్ హీరో రామ్ ఎనర్జీ మొత్తాన్ని పూరి వాడేసాడని ఈ సినిమా చూసిన వారెవరైనా చెప్పేస్తారు. రిలీజ్ అయిన ప్రతీ చోట ఊర మాస్ టాక్ తో 'ఇస్మార్ట్ శంకర్' దుమ్ము దులుపుతోంది.
ఎప్పుడు గుడ్ బాయ్ రోల్స్ చేసే రామ్ ఈసారి పక్కా మాస్ బ్యాడ్ బాయ్ గా దర్శనమిచ్చాడు. ముఖ్యంగా రామ్ మాట్లాడే తెలంగాణ భాష, పూరి మార్క్ డైలాగులు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. అయితే రామ్ ఆలా తెలంగాణా యాస మాట్లాడడానికి కారణం ఎవరో తెలుసా? మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారు. అవును ఈ సీక్రెట్ మన పూరీనే చెప్పాడు. పూరి తాజాగా ఓ టివి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 2003 లో పూరి దర్శకత్వం లో వచ్చిన 'శివమణి' చిత్రం చేస్తుండగా ఓ రోజు పూరి న్యూస్ పేపర్ లో "సినిమాల్లో తెలంగాణ భాష ఎప్పుడు విలన్ మాట్లాడుతుంటాడు.. హీరోలు ఎందుకు మాట్లాడరు" అని ఎవరో ఇచ్చిన స్టేట్ మెంట్ చూసి, నిజమే ఈ సినిమాలో కొన్ని డైలాగులు హీరోతో తెలంగాణ యాస లో చెప్పించాలని ఫిక్స్ అయ్యి, నాగార్జున కి ఈ విషయం చెప్పాడట.
దీనికి నాగ్ కూడా ఓకే అని, ఇంతకీ ఆ స్టేట్ మెంట్ ఎవరిచ్చారు అని ఆడిగినప్పుడు పూరి మళ్ళీ ఆ పేపర్ చూడగా, అందులో ఆ స్టేట్ మెంట్ క్రింద కే.సీ.ఆర్ అని రాసి ఉందట. అలా మన ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి 'కే.సీ.ఆర్' పూరి తో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని తెలంగాణ డైలాగులు రాయించాడన్నమాట.