సంధ్య థియేటర్ ఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. చివరికి ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. దీనితో టాలీవుడ్ కి కొత్త కష్ఠాలు మొదలయ్యాయా అనిపిస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయం తీవ్రంగా మారి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని తీర్మానించింది. దీనితో పెద్ద బడ్జెట్ సినిమాల నిర్మాతలు అవాక్కయ్యారు. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు.
పుష్ప 2 బెనిఫిట్ షో వలన రేవతి మృతి చెందటం, ఆ కుటుంబానికి తీవ్ర నష్టం జరగటంతో తెలంగాణా సర్కార్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు పుష్ప 2 మూవీ విషయంలో సర్కార్ బాగానే పర్మిషన్స్ ఇచ్చింది. బెనిఫిట్ షో లకోసం, టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి ఇచ్చింది. కానీ అదే బెనిఫిట్ షో వలన ఊహించని పరిణామాలు జరిగేసరికి ఇక ముందు వేటికి పర్మిషన్స్ లేవని క్యాన్సిల్ చేసేసింది. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీకి ఎలాంటి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వనని ఖరాకండిగా తేల్చేశారు రేవంత్.
దీనితో సంక్రాంతి సినిమాల నిర్మాతలు అయోమయానికి గురి అవుతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు ఏం చేస్తారు? రేవంత్ ని కలిసి ప్రాధేయపడతారా? లేదా హీరోల రెమ్యునరేషన్ తగ్గించు కుంటారా? బడ్జెట్ లెక్కలు ఆకాశాన్ని తాకకుండా చూసుకుంటారా? అన్న చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ, 'సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని, తెల్లవారుజామున 4.30కి షో వేస్తె చాలని అన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రజంట్ అమెరికాలో ఉన్నారని, రాజు గారు వచ్చాక అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని మాట్లాడతామని స్పష్టం చేసారు. సంక్రాంతికి దిల్ రాజ్ ప్రొడక్షన్ లో గేమ్ చేంజెర్ వస్తోంది. మరేం చేస్తారో చూడాలి.