'కోమాలి' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : జయం రవి, కాజల్ అగర్వాల్ తదితరులు 
దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
నిర్మాత‌లు : ఇషారి గణేష్ 
సంగీతం : హిపాప్ తమిళ 
సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ నాథన్ 
ఎడిటర్: ప్రదీప్ రాఘవ్ 

 

రేటింగ్‌: 2.75/5

 

సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌, ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌... స‌మాజం అంతా వీటి చుట్టూనే తిరుగుతుంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం. సాధిస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్ర‌యాణంలో మ‌నం ఏం కోల్పోయాం?  దేన్ని దూరం చేసుకున్నాం?  స్వ‌చ్ఛ‌మైన న‌వ్వులు, ఆత్మీయ‌త‌లు ఏమ‌య్యాయి?   వీటిని చ‌ర్చిస్తూ... ఓ సినిమా వ‌చ్చింది. అదే `కోమాలి`. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని ఇప్పుడు అదే పేరుతో తెలుగులో డ‌బ్ చేశారు. జీ 5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మ‌రి `కోమాలి` ఎలా వుంది?  ఇంకా ఏమేం చెప్పింది?


* క‌థ‌


ర‌వి (జ‌యం ర‌వి) త‌న ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో అనుకోని ప్ర‌మాదం వ‌ల్ల కోమాలోకి వెళ్లిపోతాడు. మ‌రో ప‌ద‌హారు సంవ‌త్స‌రాల త‌ర‌వాత కోమా నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు. ఈ ప‌ద‌హారేళ్ల‌లో ప్ర‌పంచం చాలా మారిపోతుంది. చిన్న ఇల్లులుపోయి అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్ వ‌చ్చేస్తుంది. తండ్రి చ‌నిపోతాడు. ఇంట‌ర్ లో తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్ల‌యిపోతుంది. ఆ బాధ నుంచి తేరుకోవ‌డానికి మ‌రో అమ్మాయిని చూసి, ప్రేమించాల‌నుకుంటాడు. ఆ ప్ర‌యత్నంలో అనుకోని అనుమానాలు ఎదుర‌వుతాయి. మారిన ప్ర‌పంచంతో ర‌వి స‌ర్దుబాటు కాలేక‌పోతాడు. నువ్వు తిన‌డానికి త‌ప్ప ఇక దేనికీ ప‌నికి రావా.. అంటూ చెల్లాయి కూడా ప్ర‌శ్నిస్తుంది. అందుకే ఏదో ఓ ప‌ని చేద్దామ‌ని నిర్ణ‌యించుకుంటాడు. చివ‌రికి సెక్యురిటీ గార్డ్ గా అవ‌తారం ఎత్తుతాడు. ఓ మ్యూజియంలో ప‌ని దొరుకుతుంది. అయితే ఆ మ్యూజియంలో... ఓ విలువైన విగ్ర‌హం ఉంటుంది. దాని విలువ కొన్ని కోట్లు. నిజానికి ఆ విగ్రహం ఎవ‌రిదో కాదు.. ర‌విదే. మ‌రి.. ర‌వి విగ్ర‌హం ఆ మ్యూజియంలో ఎందుకు ఉంది?  ఆ విగ్ర‌హం చుట్టూ జ‌రిగిన క‌థేమిటి?  అనేది తెర‌పై చూడాలి.


* విశ్లేష‌ణ‌


ప‌ద‌హారేళ్లు కోమాలో ఉన్న వ్య‌క్తికి స‌డ‌న్‌గా మెల‌కువ వ‌చ్చి, మారిన ఈ లోకాన్ని చూసి ఎలా ఆశ్చ‌ర్య‌పోతాడు, ఇప్ప‌టి ట్రెండ్ ని ఎలా అర్థం చేసుకుంటాడు? అనే విచిత్ర‌మైన కాన్సెప్ట్ తో ఈ సినిమా త‌యారైంది. క‌థ‌లో కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. తొలి స‌న్నివేశాలు కూడా స‌ర‌దాగా సాగాయి. ఆ క్ర‌మంలో బోలెడ‌న్ని సెటైర్లు ప‌డ్డాయి. గూగుల్ మ్యాప్ ని న‌మ్ముకుని... రోడ్డెక్కితే ఏం అవుతుందో ఓ స‌న్నివేశంలో స‌ర‌దాగా చూపించారు. చెరువులు పూడ్చి, అపార్ట్ మెంట్ లు ఎలా క‌ట్టాడో ఓ డైలాగ్ లో వినిపించారు. సెల్‌ఫోన్ ప్ర‌పంచంలో ఏం కోల్పోతున్నామో, ఎవ‌రికి దూరం అవుతున్నామో, అస‌లైన ఆనందాలేమిటో.. ఓ సుదీర్ఘ‌మైన డైలాగ్ తో హీరోతో ప‌లికించారు. ఇప్ప‌టి ట్రెండ్ ని అర్థం చేసుకోలేని ఓ వ్య‌క్తి, సాధ‌క బాధ‌కాలు ఈ సినిమా అనుకోవొచ్చు. కాబట్టి బోలెడంత ఫ‌న్ పండింది. మ‌ధ్య‌లో క్లాసులు కూడా బాగానే తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు.


విగ్ర‌హం గొడ‌వ‌తో సెకండాఫ్ ని లాగించేశారు. నిజానికి తొలి స‌గానికీ, రెండో స‌గానికీ ఎలాంటి సంబంధం ఉండ‌దేమో అనిపిస్తుంది. విగ్ర‌హం కాకుండా మ‌రో బ‌ల‌మైన కాన్లిఫ్ట్ సృష్టించుకుంటే ఇంకా బాగుండేది. కాక‌పోతే... ప్ర‌తీ స‌న్నివేశాన్ని న‌వ్వుకోవ‌డానికి అన్న‌ట్టే తెర‌కెక్కించారు. ముఖ్యంగా తొలి స‌గంలో.. మ‌ర్డ‌ర్ ప్లాన్ సైతం బాగా న‌వ్విస్తుంది. రీలు కోసం వెదికే క్ర‌మంలో న‌డిచే స‌న్నివేశం కూడా న‌వ్విస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్ని హృద‌యానికి హ‌త్తుకునేలా తెర‌కెక్కించారు. ఏం మారినా, ఎన్ని ట్రెండ్లు వ‌చ్చినా మాన‌వ‌త్వం మార‌లేద‌న్న విష‌యాన్ని చెప్పాడు ద‌ర్శ‌కుడు. ఆప‌ద స‌మ‌యంలో.. ఒక‌రికి మ‌రొక‌రు తోడుగా నిల‌వ‌డం కాదు, ఆప‌ద‌లు లేన‌ప్పుడు కూడా అలానే ఉంటే బాగుంటుంది క‌దా?  అనే సందేశాన్ని అందించాడు.  చెన్నై వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో క్లైమాక్స్  రాసుకోవ‌డం, చెన్నై ప్ర‌జ‌ల‌లో దాగున్న మాన‌వ‌త్వాన్ని హైలెట్ చేయ‌డం బాగున్నాయి.


* న‌టీన‌టులు


జ‌యం ర‌విది రెండు పార్శ్వాలున్న పాత్ర‌. ఒక‌టి... ఇంట‌ర్ వ‌య‌సులో న‌డిచే ప్రేమ‌క‌థ‌. మ‌రోటి.. 16 ఏళ్లు  కోమాలో ఉండి, ఈ లోకాన్ని అర్థం చేసుకోలేని పాత్ర‌. రెండింట్లోనూ బాగానే న‌టించాడు. జూనియ‌ర్ ఇంట‌ర్ చ‌దువుతున్న అబ్బాయిగా చూడ్డానికి కాస్త క‌ష్ట‌ప‌డాల్సివ‌స్తుంది. కాజ‌ల్ ది అతిథి పాత్ర అనుకోవాలంతే. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ కామెడీ ట‌చ్ ఉన్న విల‌న్ పాత్ర‌లో మెప్పించాడు. ఇక ఎక్కువ మార్కులు క‌థానాయ‌కుడి ఫ్రెండ్ గా న‌టించిన యోగిబాబుకి ప‌డ‌తాయి. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఓ ర‌కంగా ఈ సినిమాకి రెండో హీరో త‌నే.


* సాంకేతిక వ‌ర్గం


క‌థ‌లో కొత్త పాయింట్ ఉంది. అయితే దాన్ని రెండో స‌గంలో డైవ‌ర్ట్ చేశాడ‌నిపిస్తుంది. దాదాపు అన్ని స‌న్నివేశాలూ కామెడీ ట‌చ్‌తో సాగేవే. లాజిక్‌లు వేసుకోకుండా చూస్తే బాగానే ఉంటుంది. డ‌బ్బింగ్ పాట‌ల్లో ప‌దాలు స‌రిగా వినిపించ‌వ‌నే ఓ విమ‌ర్శ ఉంది. అయితే.. ఈ సినిమా లోని పాట‌ల విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. పాట‌ల్లో ప్ర‌తిప‌దం వినిపించింది.  కొన్ని డైలాగులు వింటే.. క్లాస్ పీకుతున్న‌ట్టు అనిపిస్తుంది. ఆ ఉప‌న్యాస ధోర‌ణి త‌గ్గించుకుంటే బాగుండేది.


* ప్ల‌స్ పాయింట్స్‌

ఎంచుకున్న పాయింట్‌
కామెడీ స‌న్నివేశాలు
సెటైర్లు


* మైన‌స్ పాయింట్స్‌


సెకండాఫ్ డైవర్ట్ అవ్వ‌డం
స్పీచుల్లా మారే డైలాగులు


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  కోమాలి.. జ‌స్ట్ ఫ‌ర్ ఫ‌న్‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS