ఈసారి ఎన్నికలలో హడావుడి చేసిన నటీనటుల జాబితా తీస్తే.. పోసాని కృష్ణమురళి, ఫృథ్వీల పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి. వైకాపా తరపున ముందు నుంచీ గట్టిగా ప్రచారం చేశారు ఇద్దరూ. ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తూ, మీడియా దృష్టిని ఆకర్షించారు. ఓ పార్టీ తరపున ప్రచారం చేస్తే, ఆ పార్టీ గెలిస్తే.. తప్పకుండా అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చింది.. సో.. జగన్ తమని గుర్తిస్తాడని, ఏదో ఓ పదవి ఇచ్చి - తన రుణం తీర్చుకుంటాడని పోసాని, ఫృథ్వీలు ఎదురుచూస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికలలో తనకూ ఓ సీటు ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూశాడు ఫృథ్వీ. కానీ అది జరగలేదు. అయినా సరే.. పార్టీలోనే ఉంటూ, విస్క్కృతంగా ప్రచారం చేశాడు. జగన్ గెలవాలని తిరుపతికెళ్లి, తలనీలాలు ఇచ్చొచ్చాడు.
ముందు నుంచీ పోసాని వైకాపా పార్టీనే. వీలైనప్పుడల్లా ప్రెస్ మీట్లు పెట్టి, జగన్‌కి కీర్తిస్తూ, ప్రత్యర్థుల్ని తూర్పారబడుతూ... మీడియాని షేక్ చేశారు. ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చింది. ఇద్దరికీ ఏదో ఓ నామినేటెడ్ పోస్టు కట్టబెట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులకు మంచి గిరాకీ ఉంది. అందులో ఒకటి రోజా తన్నుకుపోయింది. ఇక మిగిలినవి మంత్రి పదవి ఆశించి భంగపడినవాళ్లకిచ్చి - శాంతపరచాలి. ఆ తరవాత కూడా మిగిలితే సినిమావాళ్లకొస్తాయి. ఆ జాబితాలో ముందున్నది వీరిద్దరే. ఇద్దరికీ కాకపోయినా ఒక్కరికైనా ఏదో ఓ నామినేటెడ్ పదవి రావడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.