'మెగాస్టార్ చిరంజీవి నాలాంటి చాలామందికి రోల్ మోడల్. ఆయన కష్టపడే తత్వం ఈ తరానికే కాదు, ఏ తరానికైనా ఆదర్శం. అందుకే ఆయనతో ఫొటో దిగితే చాలనుకున్నాను. సినిమాలో అవకాశమొస్తే ఎగిరి గంతేశాను. చివరికి అందులో నా సీన్స్ తీసేశారని తెలియగానే చాలా బాధపడ్డాను. కానీ అర్థం చేసుకున్నాను' అని చెప్పారు కమెడియన్ పృధ్వీరాజ్. సినిమా అన్న తరువాత విడుదలకు ముందు ఫైనల్ ఔట్‌పుట్ కోసం కొన్ని సీన్స్ తొలగించాల్సి ఉంటుందని అలా తన సీన్స్ కూడా కట్ అయి ఉంటాయి తప్ప, ఎవరో కావాలని చేసింది మాత్రం కాదని, తన చుట్టూ జరుగుతున్న వివాదంలో అర్థం లేదని పృధ్వీరాజ్ వివరణ ఇచ్చారు. కానీ కొంత బాధపడిన మాట వాస్తవం అని పృధ్వీరాజ్ చెబుతూ, దానికి చిరంజీవి మీద తనకున్న అభిమానమే కారణమని అన్నారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్‌తో పృధ్వీ తెలుగులో పాపులర్ అయ్యారు. ఆ తరువాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ హీరోగా సినిమా చేసే స్థాయికి ఎదిగారు. చాలా అరుదుగా మాత్రమే దక్కుతుంటుంది ఇలాంటి అవకాశం. 'మీలో ఎవరు కోటీశ్వరుడ' సినిమాలో హీరోగా నటించిన పృధ్వీరాజ్, చిరంజీవికి తాను వీరాభిమానిననీ చిరంజీవే కాకుండా చిరంజీవి కుటుంబంలో దాదాపు అందరు హీరోలతోనూ తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పాడు గతంలో ఓ ఇంటర్వ్యూలో. ఏదేమైనా పృధ్వీ ఆవేదన ఫలించి, తొలగించిన ఆ సన్నివేశాలు సినిమా రిలీజయిన తర్వాత అయినా జత చేస్తారేమో చూడాలిక.