పెళ్లి పీటలెక్కనున్న తమిళ హీరో విశాల్‌.!

మరిన్ని వార్తలు

ప్రముఖ తమిళ హీరో విశాల్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. విశాల్‌ తండ్రి ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి ఈ విషయాన్ని తాజాగా కోలీవుడ్‌ మీడియా వర్గాలతో తెలిపారు. అనీషా అనే అమ్మాయితో విశాల్‌కి త్వరలో నిశ్చితార్ధం జరగనుందని ఆయన తెలిపారు. ఇప్పుడీ టాపిక్‌ కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎందుకంటే నడగర్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్‌ అందుకోసం ఓ కొత్త భవనాన్ని నిర్మిస్తాననీ, ఆ భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ పెళ్లి చేసుకోనని గతంలో మాటిచ్చారు.

 

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆ భవనం త్వరలోనే పూర్తి కానుంది. ఈలోగా విశాల్‌ చెప్పినట్లుగా తన జీవిత భాగస్వామిని కూడా సెలెక్ట్‌ చేసి ఉంచుకున్నారు. త్వరలో హైద్రాబాద్‌లో విశాల్‌ ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఘనంగా జరగనుందట. ఇదిలా ఉంటే హీరో విశాల్‌కీ, నటుడు శరత్‌కుమార్‌ తనయ వరలక్ష్మీకి మధ్య లవ్‌ ఎఫైర్‌ గురించి పలు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.

 

ఇప్పటికీ ఈ విషయంలో కోలీవుడ్‌ జనాల్లో చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇటీవల వరలక్ష్మి, 'విశాల్‌ నాకు జస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్‌ లేదు..' అని తేల్చేసింది. అయినా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడలేదు. కానీ తాజా వార్తతో ఇకపై ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలిక. రీసెంట్‌గా విశాల్‌ 'పందెం కోడి 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS