సెట్స్ పై వున్న నాని కొత్త సినిమా దసరా. శ్రీకాంత్ ఒదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ కోసం దాదాపు 7 కోట్ల రుపాయిలు విలువ చేసిన సెట్ ని వేశారని తెలిసింది. ఈ సెట్ లో సినిమాలో కీలకమైన సన్నివేశాలు ఉంటాయని సమాచారం. నాని కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సెట్ వేయడం ఇదే తొలిసారి. ఒక కొత్త దర్శకుడి సినిమాకి ఈ స్థాయిలో సెట్ వేయడం అంటే విశేషమే.
ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్‌లో కనిపిస్తున్నాడు. రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్‌లో ఇప్పటికే ఫస్ట్ లుక్ రివిల్ చేశారు. నాని ఈ సినిమా కోసం తెలంగాణ యాసని కూడా నేర్చుకున్నాడు. దసరా కథ గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. నాని సరసన కథానాయికగా కీర్తి కనిపించనుంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.