తెలుగునాట దిగ్గజ నిర్మాతగా ప్రసిద్ధి చెందారు సురేష్‌బాబు. ఆయన బిజినెస్ మైండ్ గురించి తెలియంది కాదు. లాభసాటి అనుకుంటేనే.. ఏ సినిమా అయినా మొదలెడతారు. రామానాయుడు వారసత్వాన్ని అక్షరాలా పుణికి పుచ్చుకుని `సురేష్ ప్రొడక్షన్స్`కీ, `రామానాయుడు స్టూడియోస్`నీ తన రెండు భుజాలపై వేసుకుని మోస్తున్నారు. ఆ సంస్థల ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. అయితే సురేష్ బాబు త్వరలోనే అస్త్ర సన్యాసం చేస్తున్నారని టాలీవుడ్ టాక్. ఇటీవల ఆయన హైదరాబాద్ నానక్ రామ్ గూడాలోని స్టూడియోని డవలప్‌మెంట్‌కి ఇచ్చేశారు.
మరోవైపు స్టూడియోల సంస్కృతి బాగా తగ్గిపోతోంది. కరోనా, లాక్ డౌన్‌ల వల్ల సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి. సినిమా వ్యాపారం ఇది వరకటిలా లాభసాటి కాదు. అందుకే సినిమాలకూ, స్టూడియోలకూ దూరం అవ్వాలని ఆయన నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ బాధ్యతల్ని తనయుడు రానాకి అప్పగించాలని చూస్తున్నార్ట. రానానే రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతల్ని తీసుకోబోతున్నారని, రానాకు బాధ్యతలు అప్పగించి, సురేష్ బాబు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.