నాని చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా దసరా. ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే అందరినీ సర్ప్రైజ్ చేశాడు నాని. మునుపెన్నడూ కనిపించని మాస్ పాత్రలో కనిపించాడు. తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో కూడా అంతా మాస్ కనిపించింది. ఇప్పుడు ట్రైలర్ కూడా నాటుదనంతో నిండిపోయింది. రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆద్యంతం మాస్ యాక్షన్ గా సాగింది.
దసరా తెలంగాణ, బొగ్గు గనుల నేపధ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. బతుకమ్మ పాటతో ట్రైలర్ ని మొదలుపెట్టారు. తర్వాత నాని, కీర్తి సురేష్ ల పాత్రల పరిచయం చేసి.. ఇక యాక్షన్ లోకి దిగారు. ట్రైలర్ లో కథ ఏమిటో రివిల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. వెన్నల పై ట్రైలర్ ని ఓపెన్ చేసిన దర్శకుడు.. తర్వాత మొత్తం ధరణి ప్రపంచంలోకి వెళ్లి స్నేహం, వర్గ పోరాటం చూపించాడు. ఒక ట్రైన్ సీక్వెన్స్ ప్రధానంగా కనిపించింది. ట్రైలర్ చివర్లో ధరణి, వెన్నలని ఒక ఎమోషనల్ బీజీఏంతో చూపించడంతో..దసరాలో లవ్ ట్రాక్ రెగ్యులర్ కి భిన్నంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు.
నాని మాస్ అవతార్ లో తెలంగాణ యాసలో ఆకట్టుకున్నాడు. ఇలాంటి యాక్షన్ చేయడం కూడా నానికి ఇదే తొలిసారి. కీర్తి సురేష్ ప్రజన్స్ కొత్తగా వుంది. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘పది తలకాయలు ఉన్నోడే ఒక్క తలకాయ ఉన్నవోడి చేతిలో కుక్క సావు సచ్చిండు. పురాణాలని మించిన బతుకులా మనవి’ అనే డైలాగ్ దసరా టైటిల్ కి జస్టిఫికేషన్ అన్నట్టుగా వుంది.మొత్తానికి యాక్షన్, ఎమోషన్స్, ఫెర్ఫార్మెన్స్, బ్యాగ్డ్రాప్ పరంగా దసరా ఓ కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమని ట్రైలర్ భరోసా ఇచ్చింది.