సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. 'దర్శకరత్న'' పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని త్వరలో ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శ్రీశైలం వంటి భారీ బడ్జెట్ హిట్ సినిమాను ఇదే నిర్మాత నిర్మించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాగా ఈ చిత్రం గురించిన విషయాలను తెలియజేసేందుకు గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు ధవళసత్యం తెలియజేస్తూ, చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి, రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది. దాంతో నాకు తెలిసిన,, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం ఉన్న అనేకమందిని సంప్రదించి, ఈ చిత్రం స్క్రిప్ట్ ను అద్భుతంగా రూపకల్పన చేయడం జరుగుతోంది. తప్పకుండా దీనిని ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించేందుకు, దాసరి గారి పట్ల ఎనలేని అభిమానంతో పాటు మంచి అభిరుచి కలిగిన తాడివాక రమేష్ నాయుడు ముందుకు రావడం అభినందనీయం'' అని అన్నారు