టాలీవుడ్ కి కీలకమైన సీజన్ సంక్రాంతి. అందరి దృష్టీ సంక్రాంతి సినిమాలపైనే ఉంది. అయితే దానికంటే ముందు.. ఓ మినీ సంక్రాంతిని చూడబోతోంది టాలీవుడ్. ఈ డిసెంబరులో కొన్ని కీలకమైన సినిమాలు బాక్సాఫీసు ముందుకు రాబోతున్నాయి. ఈ నెలలో ప్రతీ వారం ఓ పెద్ద సినిమా పలకరించబోతోంది. గత కొంతకాలంగా సరైన హిట్ చూడని టాలీవుడ్ కి డిసెంబర్ అత్యంత కీలకంగా మారబోతోంది. 2021కి ఘనంగా వీడ్కోలు పలకాలంటే.. డిసెంబరు నెలలో ఒకట్రెండు హిట్లు పడడం అత్యవసరంగా మారింది. ఈ డిసెంబరులో అఖండ, పుష్ప 1, శ్యాం సింగరాయ్, గని చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. వీటిపై భారీ ఆశలు పెట్టుకుంది టాలీవుడ్.
డిసెంబరు 2న అఖండ విడుదల అవుతోంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ట్రైలర్ టాలీవుడ్ ని షేక్ చేసేస్తోంది. అందులో బాలయ్య డైలాగులు, విజువల్స్.. అన్నీ... మాస్ కి కిర్రెక్కించేలా ఉన్నాయి. బాలయ్యని ఎలాంటి పాత్రలో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారో, అలాంటి పాత్రలోనే బోయపాటి చూపించబోతున్నాడు. టాలీవుడ్లో మళ్లీ రికార్డు ఓపెనింగ్స్ చూసే అవకాశం అఖండతోనే దక్కబోతోంది.
డిసెంబరు 17న పుష్ప 1 విడుదల అవుతోంది. ఈ యేడాదిలో బిగ్గెస్ట్ మూవీగా పుష్ప ఘనత సాధించింది. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో అనగానే అంచనాలు ఆకాశానికి తాకాయి. పైగా.. సుకుమార్ రంగస్థలంలోనూ, బన్నీ అలా వైకుంఠపురములో తోనూ.. మంచి ఫామ్ లో ఉన్నారు. పాటలు, టీజర్లూ... ఇప్పటికే హోరెత్తించేస్తున్నాయి. టాలీవుడ్ లో మళ్లీ 200 కోట్ల పోస్టర్ చూసే అవకాశం పుష్ప కల్పిస్తుందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల ఆశ.
డిసెంబరు 24న అయితే ఒకేసారి రెండు సినిమాలు వస్తున్నాయి. శ్యాం సింగరాయ్, గని చిత్రాలు ఒకేసారి పోటీ పడబోతున్నాయి. రెండుసినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండూ... భారీ బడ్జెట్ చిత్రాలే. వరుణ్ కెరీర్‌లోనే పెద్ద సినిమా గని, శ్యామ్ సింగరాయ్ కూడా అంతే. డిసెంబరులో ఈ 4 సినిమాలపైనే అందరికీ ఫోకస్ వుంది. వీటిలో రెండు హిట్లు పడినా - టాలీవుడ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేస్తుంది.