2021 టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదు. అన్ని రకాలుగానూ సమస్యలే. అయితే 2021 ఫినిషింగ్ టచ్ మాత్రం బాగుంది. వరుసగా మూడు విజయాలతో.. బాక్సాఫీసు దగ్గర జోష్ వచ్చింది. ఈ డిసెంబరు `అఖండ`తో మొదలైంది. డిసెంబరు 2న వచ్చిన అఖండ బాక్సాఫీసుకు పూనకాలు తెప్పించింది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మాస్ థియేటర్లకు వస్తారని, వాళ్లకు ఓ మంచి సినిమా ఇస్తే చాలని, అఖండ వసూళ్లు నిరూపించాయి. ఈ సినిమా దాదాపుగా రూ.150 కోట్లు వసూలు చేస్తుందని టాక్.
డిసెంబరు 17న విడుదలైన పుష్ప కూడా ప్రభంజనం సృష్టించింది. తొలి మూడు రోజులూ వసూళ్లతో హోరెత్తింది. హిందీలోనూ మంచి రాబడే వచ్చింది. మలయాళంలో అయితే సూపర్ హిట్ అయిపోయింది. డివైడ్ టాక్ వచ్చినా దాదాపుగా 200 కోట్లు తెచ్చుకోవచ్చన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఏపీలో టికెట్ రేట్లు తగ్గిపోయాయి గానీ, లేదంటే ఈ అంకెలు మరింత ఎక్కువగా కనిపించేవి.
ఈ శుక్రవారం విడుదలైన శ్యామ్ సింగరాయ్ కూడా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో రూపుదిద్దుకున్న సినిమా ఇది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. వరుస పరాజయాల తరవాత నానికి ఓ మంచి హిట్ పడినట్టే. మొత్తానికి.... వరుస విజయాలతో.. టాలీవుడ్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈనెల 31న అర్జున ఫల్గుణ రాబోతోంది. ఆ సినిమా ప్రచార చిత్రాలు సైతం ఆకట్టుకుంటున్నాయి. అది కూడా హిట్టయితే... 2021కి హ్యాపీ ఎండింగే!