దీపికా పడుకొనే నటించిన 'పద్మావత్' సినిమా వివాదాల్ని దాటుకుని ప్రేక్షకుల ముందుకొచ్చి, ఘనవిజయాన్ని అందుకుంది. సినిమా రిలీజ్ డేట్ వరకూ వివాదాలు కొనసాగాయి. సినిమా రిలీజయ్యాకా వివాదాలు తగ్గలేదు. ఆ వివాదాలే సినిమాకి అదనపు పబ్లిసిటీ ఇచ్చాయనే మాటల్లో నిజమెంతోగానీ, అంతా అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ అయి ఉంటే 200 కోట్ల క్లబ్‌లోకి 'పద్మావత్' ఈజీగా చేరిపోయి ఉండేది.
అయితే ఇప్పుడు సాధించిన విజయం చిన్నదేమీ కాదు. దీపిక పడుకొనే కెరీర్‌లో మరో వంద కోట్ల మైలు రాయిని చేరుకున్న సినిమాగా 'పద్మావత్' రికార్డులకెక్కింది. ఈ ఘనత సాధించిన ఏడో సినిమా ఆమె కెరీర్‌లో 'పద్మావత్'. ఈ రికార్డ్ దీపికా పడుకొనేకి తప్ప బాలీవుడ్‌లో ఇంకెవరికీ లేదు. ఇదే విషయం గురించి దీపికా పడుకొనే మాట్లాడుతూ, సినిమాలో ఏముందో తెలియకుండా కొందరు గుడ్డిగా సినిమాపై బురద జల్లడం బాధ కలిగించిందనీ సినిమాకి జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. 'సినిమా విడుదలయ్యాక అందులో వివాదాస్పద అంశాలు లేవని ప్రతి ఒక్కరూ అంటున్నారు. దాదాపు రెండు నెలలు సినిమా విడుదల ఆలస్యమయ్యింది. నిర్మాతకి ఆర్థిక నష్టమే కాదు, సినిమా సిబ్బంది అంతా మానసిక క్షోభను అనుభవించాం.
మా సినిమా మీద మాకు నమ్మకం ఉన్నాసరే, ఆ నమ్మకం, నిజం సినిమాని వివాదాల నుంచి బయటకు లాగలేకపోయాయి' అని ఆవేదన వ్యక్తం చేసింది దీపికా పడుకొనే. ఇంతటి ఘనవిజయం ఈ సినిమాపై బురదజల్లినవారికి చెంపపెట్టు అని చెప్పిన దీపికా పడుకొనే, 'పద్మావత్'ని ఓ క్లాసిక్‌గా అభివర్ణించింది. 'పద్మావత్' లాంటి సినిమా మళ్ళీ తన కెరీర్‌లో వస్తుందో రాదో చెప్పలేనని అంటోందామె. 100 కోట్లు కాదు, అంతకు మించిన ఆనందం 'పద్మావత్' విజయంతో లభించిందని దీపికా పడుకొనే అభిప్రాయపడింది.