బాలీవుడ్ భామలంటే.... మనోళ్లకు మక్కువ ఎక్కువ. డబుల్ త్రిపుల్ పారితోషికం ఇచ్చి మరీ సినిమాల్లోకి తీసుకొంటారు. వాళ్ల వల్ల ఒరిగేదేమైనా ఉందా? అంటే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ప్రాజెక్ట్ కే నే తీసుకోండి. ఇందులో దీపికా పదుకొణే కథానాయిక. ఈ సినిమా కోసం దీపికకు ఏకంగా రూ.13 కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. ఇది కేవలం పారితోషికం మాత్రమే. అదనపు ఖర్చులు దాదాపు రూ.2 కోట్ల వరకూ ఉంటాయని టాక్. అంటే.. మొత్తంగా రూ.15 కోట్లు.
ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా సినిమా. కాబట్టి బాలీవుడ్ హీరోయిన్‌ని ఎంచుకొన్నారనుకొందాం. దాని వల్ల సినిమాకి ప్లస్ ఏమైనా ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. సాహో సినిమాకి శ్రద్దా కపూర్‌ని తీసుకొన్నారు. శ్రద్దా ఎంపిక సినిమాకి మైనస్ అయ్యింది కానీ, ప్లస్ కాలేదు. ఇది ప్రభాస్ సినిమా. అంటే ముందు తెలుగు సినిమా. ఆ తరవాతే... పాన్ ఇండియా సినిమా. దక్షిణాదిన స్టార్ డమ్ ఉన్న కథానాయికలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లని కాకుండా దీపిక ని ఎంచుకోవడంలో కలిసొచ్చేదేం లేదు. పైగా... దీపికకు రూ.15 కోట్లు చాలా ఎక్కువ. బాలీవుడ్ లో దీపికకు రూ.6 నుంచి 7 కోట్లకు మించి ఇవ్వడం లేదు. దానికి రెండింతలు పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. దాంతో దీపికకు ఇంత అవసరమా? అనే చర్చ టాలీవుడ్ లో సాగుతోంది. దీనికి ప్రాజెక్ట్ కె దర్శక నిర్మాతలే సమాధానం చెప్పగలరు.