సినిమా జయాపజయాలు ఈరోజుల్లో థియేటర్ గేమ్ ని బట్టి ఆధారపడి ఉంటుందన్న విషయం సంక్రాంతి సినిమాలే రుజువు చేశాయి. 'గుంటూరు కారం' చిత్రానికి నెగిటీవ్ టాక్ వచ్చినా, లెక్కలేనన్ని థియేటర్లు బ్లాక్ చేయడంతో సంక్రాంతి సీజన్‌ని క్యాష్ చేసుకోగలిగింది. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడమే ఈరోజుల్లో విజయ రహస్యం. ఎవరి చేతుల్లో ఎక్కువ థియేటర్లు ఉంటే వాళ్లకు అనుగుణంగా సినిమా వ్యాపారం నడుస్తోంది. వాళ్ల మాటే చెల్లుబాటు అవుతోంది. 'దేవర' విషయంలోనూ ఇలాంటి థియేటర్ల ఆట మొదలైందని టాక్.
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏరియాల వారిగా ఈ సినిమాని కైవసం చేసుకోవడానికి బయ్యర్లు రెడీగా ఉన్నారు. నైజాం నుంచి 'దేవర' కోసం గట్టి పోటీ మొదలైంది. ఈ చిత్రం కోసం మైత్రీ మూవీస్, దిల్ రాజు ఇద్దరూ పోటీ పడుతున్నారు. మైత్రీ మూవీస్ ఫ్యాన్సీ ఆఫర్ తో వెళ్లింది. కాకపోతే... నైజాంలో థియేటర్లన్నీ దిల్ రాజు చేతుల్లో ఉన్నాయి. ఒకవేళ 'దేవర' నైజాం రైట్స్ ని దిల్ రాజుకి కాకుండా మైత్రీకి ఇస్తే... థియేటర్లు దొరుకుతాయా, లేదా? అనేది సందేహం.
'దేవర' కంటే ఓ వారం ముందు దిల్ రాజు సంస్థ నుంచి 'ఫ్యామిలీ స్టార్' సినిమా వస్తోంది. అది దిల్ రాజు సినిమా కాబట్టి.. నైజాంలో థియేటర్లన్నీ ఆ సినిమాకే ఇస్తారు. మరుసటి వారం కూడా బ్లాక్ చేస్తే.. 'దేవర'కు తక్కువ థియేటర్లు ఉంటాయి. 'ఫ్యామిలీ స్టార్' సినిమా టాక్ ఎలా ఉన్నా, పంతానికి పోయి థియేటర్లు ఆపుకొంటే.. 'దేవర'కు నష్టం. అందుకే ఈ సినిమాని దిల్ రాజుకే ఇవ్వాలని 'దేవర' టీమ్ భావిస్తోందని టాక్.