సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుందని, అందులో దేవిశ్రీ ప్రసాద్ హీరో అని `కుమారి 21 ఎఫ్` సక్సెస్ మీట్‌లో కూడా ప్రకటించేశారు. కానీ ఆసినిమాకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈలోగా నాన్నకు ప్రేమతో సినిమా పూర్తి చేశాడు సుక్కు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వాలంటే మరో యేడాదైనా పడుతుంది. ఆ తరవాతే దేవి సినిమా మొదలవ్వాలి. అయితే డీఎస్‌పీ ఇప్పటికీ ముదిరిపోయాడు. ఓ ఐదారేళ్ల క్రితమే హీరో అవ్వాల్సిన దేవి.. ఇప్పుడు అవుతానంటే - అంత క్రేజ్ ఉంటుందా? అనేది అనుమానంగా మారింది. దేవికి హీరోగా తనని తాను తెరపై చూసుకోవాలని ఉన్నా.. సుక్కు మాత్రం తన సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. అందుకే దేవి మరో దర్శకుడ్ని చూసుకోవాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. సుకుమార్ కథతో సుక్కు శిష్యుడు ఈ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఆ దర్శకుడు ఎవరో, ఈ సినిమాని ఎప్పుడు మొదలెడతారో చూడాలి.