తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరికొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారా? ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారా? ప్రస్తుతం తమిళ నాట వినిపిస్తున్న ఊగాహానాలివి. రజనీ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తలేం కొత్త కాకపోవొచ్చు. కాకపోతే ఈసారి ఈ వార్తల్ని గాలివార్తలుగా కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమిళనాట ప్రస్తుతం రాజకీయ శూన్యత ఏర్పడిందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. జనాకర్షణ ఉన్న రజనీకాంత్ మాత్రమే దాన్ని పూడ్చగలరని తమిళ తంబీల ఆశ. రజనీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా రజనీ రాజకీయ ప్రవేశాన్ని బలపరుస్తున్నాయి. `అధికారం అంటే ఇష్టమే` అంటూ ఇటీవల రజనీ చేసిన కామెంట్.... సంచలనం రేపింది. అయితే `అధికారం` అనే మాట కేవలం `ఆధ్యాత్మిక పరంగానే వాడా` అంటూ మాట మార్చాడు రజనీకాంత్. మరోవైపు బీజేపీ రజనీకాంత్‌ని బుట్టలో వేసుకోవాలన్న ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. దిల్లీ నుంచి ఓ ప్రత్యేక బృందం చెన్నై వస్తోందని, రజనీకాంత్‌తో మంతనాలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే రజనీ స్వయంగా ఓ రాజకీయ పార్టీ పెట్టినా పెట్టొచ్చని, దానికోసం బీజేపీ మద్దతు తీసుకోవొచ్చని సమాచారం అందుతోంది. మరి రజనీకాంత్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.