ఫ్లాప్ టాక్ నుంచి యావరేజ్‌కి... యావరేజ్ నుంచి హిట్ వైపుకి దూసుకుపోతోంది ధమాకా. గత వారం విడుదలైన ధమాకా కమర్షియల్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఈవారం పెద్దగా సినిమాలేవీ లేకపోవడం ధమాకాకు కలిసొచ్చింది. జనవరి తొలి వారంలో కూడా పెద్ద సినిమాల్లేవు. సంక్రాంతి వరకూ బాక్సాఫీసు ఖాళీనే. దీన్ని ధమాకా క్యాష్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ... రూ.50 కోట్లు రాబట్టింది ధమాకా. మరో రూ.10 కోట్ల వచ్చాయంటే బ్రేక్ ఈవెన్‌లో పడిపోతోంది. ఆల్రెడీ నిర్మాతలకు ఈ సినిమాతో లాభాలొచ్చినట్టు టాక్. ఇక మీద వచ్చేదంతా బోనసే. ఈవారం కూడా ధమాకా బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతే.. బయ్యర్లు సైతం గట్టున పడిపోతారు.
2022లో రవితేజ నుంచి మూడు సినిమాలొచ్చాయి. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ధమాకాకీ తొలి రోజు టాక్ ఏమాత్రం బాగాలేదు. అది కూడా ఫ్లాపు అనుకొన్నారంతా. కానీ అనూహ్యంగా ధమాకా తేరుకొంది. వసూళ్ల పరంగా.... సంతృప్తికరమైన ఫలితాన్ని రాబట్టింది. ఈ సినిమాకి పోటీ లేకపోవడంతో - నిలబడి గట్టెక్కేసింది. మొత్తానికి 2022లో చివరి హిట్ ధమాకా అని చెప్పుకోవాలి. రవితేజ రాబోయే సినిమాలకు ఇది బూస్టప్ అనుకోవాలి.