తారలు ఏం చేసినా... సంచలనమే. వాళ్ల పెళ్లిళ్లు, విడాకులు సైతం... వార్తలు అవుతాయి. జనాలతో పాటు మీడియా కూడా వాటి గురించి పదే పదే మాట్లాడుకొంటాయి. అయితే.. కొంతమంది తమవైన జీవితాల్ని, వ్యక్తిగత విషయాల్నీ బయటకు రాకుండా చూసుకొంటుంటారు. ఆఖరికి పెళ్లిళ్లు, విడాకుల విషయంలో కూడా రహస్యాలు పాటిస్తుంటారు. ధన్య బాలకృష్ణ కూడా అదే చేసింది. టాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోంది ధన్య. చిన్నా చితకా సినిమాలు చేసినా తనదైన గుర్తింపు రాలేదు. కాకపోతే.. ఎప్పుడూ ఏదో ఓ సినిమాతో బిజీగా ఉంటుంది. ఇప్పుడు తనకు పెళ్లయిపోయింది. ఏడాది క్రితమే ఓ దర్శకుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకొంది. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
తమిళ నటి కల్పికా గణేష్... ధన్య బాలకృష్ణ రహస్య వైవాహిక జీవితం గురించి కొన్ని వీడియోల్నీ, ఆధారాల్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ధన్య.. బాలాజీ మోహన్ అనే దర్శకుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకొందని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. దాంతో... ఈ విషయం బయటకు వచ్చింది. అయితే... దీనిపై ధన్య ఇప్పటి వరకూ స్పందించలేదు. కాకపోతే.. బాలాజీ మోహన్ మాత్రం ఈ విషయంపై చెన్నై హై కోర్టులో పిటీషన్ వేశాడు. కల్పిక తమ వ్యక్తిగత జీవితాల్ని, స్వేచ్ఛనీ భంగం కలిగిస్తోందని, యేడాది క్రితమే.. ధన్యతో తన పెళ్లి జరిగిందని ఆ పిటీషన్‌లో స్పష్టం చేశారు. దాంతో.. వీరిద్దరి పెళ్లి వార్త అఫీషియల్ గా బయటకు వచ్చేసినట్టైంది. అయితే బాలాజీకి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యకు ఆయన విడాకులు ఇచ్చేశారు.