ఈ ఏడాది ఆరు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత 'దిల్' రాజు. సినిమా టైటిల్ 'దిల్'ని ఇంటి పేరుగా మార్చుకున్న రాజుగారు, తాను నిజంగానే 'దిల్' ఉన్న రాజునని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నారు.
'మా వెంకటేశ్వర బ్యానర్ నుంచి ఆరు సినిమాలొచ్చాయి. కానీ, ఆ సినిమాలు మీవి..' అని ఆ సినిమాల్ని తెరకెక్కించిన దర్శకులు, టెక్నీషియన్లు, ఆ సినిమాల్లో నటించిన నటీనటులకు క్రెడిట్ ఇవ్వడం ద్వారా 'దిల్' రాజు తాను 'మనసున్న' రాజుననిపించుకున్నారు. 2017లో 'దిల్' రాజుకి ఎదురే లేకుండా పోయింది. ఏ సినిమా తీస్తే ఆ సినిమానే పెద్ద హిట్. బ్లాక్ బస్టర్ 'శతమానం భవతి'తో మొదలు పెట్టి, బ్లాక్ బస్టర్ 'ఎంసీఏ'తో 2017ని ముగించడం అద్భుతమే.
ఈ ఏడాదిలో 'దిల్' రాజు ఇంట్లో ఓ విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. అదే ఆయన సతీమణి హఠాన్మరణం. ఆ ఘటనతో ఆయన కుంగిపోయారు. ఆ సమయంలో ఆయన్ని ఓదార్చిందెవరో కాదు, ఆయన్ని నమ్ముకున్న దర్శకులే. వంశీ పడిపల్లి, తన కుటుంబ సభ్యుడిలాంటివాడనీ, ఆ సమయంలో ఆయన తనను ఓదార్చిన తీరుని ఎప్పటికీ మర్చిపోలేనంటారు దిల్ రాజు. 'ఈ రోజు నేనిలా ఉన్నానంటే దానికి కారణం నా సక్సెస్‌లు కాదు, నా చుట్టూ ఉన్న మనుషులు. దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులు కుటుంబ సభ్యుల్లా నా వెంట నిలిచారు కష్ట కాలంలో' అని చెబుతూ దిల్ రాజు కంటతడి పెడుతోంటే ఆ సందర్భం చాలా ఉద్వేగభరితంగా మారిపోయింది.
ఏడాదిలో ఆరు హిట్ సినిమాలు తీసిన సందర్భంలో 'దిల్' రాజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది.