ఈ సంక్రాంతికి తెలుగు తెరపై సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. రెండు స్ట్రయిట్ సినిమాలు (వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి) లతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు (వారసుడు, తెగింపు) రాబోతున్నాయి. చిరు, బాలయ్య సినిమాలకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి.. థియేటర్ల పరంగా... చిరు, బాలయ్యలదే ఆధిపత్యం. ఈ రెండు చిత్రాల్నీ మైత్రీ మూవీస్ నిర్మించింది. వాళ్లు కూడా ఈ సినిమాలకు మంచి ధియేటర్లనే తీసుకొచ్చారు. కాకపోతే.. విశాఖలో చిరు, బాలయ్య సినిమాలకు ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ వాల్తేరువీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు సరైన థియేటర్లు దొరకలేదు. దానికి కారణం.. దిల్ రాజునే.
విశాఖలో దాదాపు అన్ని థియేటర్లూ దిల్ రాజు చేతిలో ఉన్నాయి. తన సినిమా `వారసుడు`కి అందులో సగం థియేటర్లు కేటాయించుకొన్నాడు. మిగిలిన సగం థియేటర్లూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పంచుకొన్నాయి. చిరు, బాలయ్య సినిమాలకు కొన్నే థియేటర్లు ఇవ్వడం, ఓ డబ్బింగ్ సినిమాకు అన్ని థియేటర్లు కేటాయించడం విమర్శల పాలవుతోంది.కానీ.. వారసుడు అనేది దిల్ రాజు సొంత సినిమా. తన సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకోవాలనే స్వార్థం నిర్మాతగా దిల్ రాజు కు ఉండడంలో తప్పు లేదు. కాకపోతే ఓ డబ్బింగ్ సినిమా రావడం వల్ల స్ట్రయిట్ సినిమాలకు, అందులోనూ చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చింది. నైజాంలో కూడా దిల్ రాజు చేతిలో థియేటర్లు ఉన్నాయి. కానీ అదే సమయంలో ఏసియన్, సురేశ్ బాబు, గీతా ఆర్ట్స్‌లకు థియేటర్లు ఉన్నాయి. కాబట్టి.. చిరు, బాలయ్య సినిమాలకు పెద్ద ఇబ్బంది లేదు.