పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయడం తన లక్ష్యమని చాలాసార్లు చెప్పాడు దిల్ రాజు. ఆ ఆశ, ఆకాంక్ష వకీల్ సాబ్ తో తీరిపోయాయి. మూడేళ్ల తరవాత.. పవన్ కల్యాణ్ కి ఓ హిట్ ఇచ్చిన ఆనందం దిల్ రాజులో కనిపించింది. ఆ సినిమా దిల్ రాజుకి భారీ లాభాల్ని తీసుకొచ్చింది. పవన్ తో మరో సినిమా చేసే ఛాన్స్ కూడా ఇచ్చింది. అయితే వకీల్ సాబ్ తో కొన్ని తలనొప్పులూ వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీ విడుదల వల్ల. వకీల్ సాబ్ ని త్వరలోనే అమేజాన్ లో ప్రదర్శించబోతున్నారు.
థియేటర్లో చూడని వాళ్లు ఎంచక్కా ఈ సినిమాని ఇంట్లో చూసేయొచ్చు. అయితే.. ఓవర్సీస్ బయ్యర్ మాత్రం ఈ సినిమాని ఇంత త్వరగా ఓటీటీలో ఎలా ప్రదర్శిస్తారు? అని లాజిక్కులు లాగుతున్నాడు. సినిమా విడుదలైన 50 రోజుల తరవాతే ఓటీటీలోకి ఇస్తామని దిల్ రాజు ఎగ్రిమెంట్ లో పేర్కొన్నారని, ఇప్పుడు 50 రోజులు పూర్తవ్వకుండానే ఓటీటీలో వేస్తే.. తనకు చాలా నష్టాలొస్తాయని ఓవర్సీస్ పంపిణీదారులు దిల్ రాజుని ప్రశ్నిస్తున్నాడు.
ఓటీటీ విడుదల ఆపేయాలని, లేదంటే తనకు 3 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, ఈ విషయంలో తాను కోర్టుకు కూడా వెళ్లడానికి వెనుకంజ వేయనని హెచ్చరిస్తున్నాడు. ఇదే బాటలో మిగిలిన బయ్యర్లూ బెదిరిస్తే... దిల్ రాజు కి కష్టమే. మరి దిల్ రాజు ఏం చేస్తాడో చూడాలి.