ఓ చిన్న సినిమాకి ఈ రోజుల్లో ప్రచారం చాలా అవసరం. సినిమా ఎంత బాగున్నా జనాలు థియేటర్లకు రావడానికి సందేహిస్తున్నారు. రివ్యూల్లో స్టార్ రేటింగులు మెరుస్తున్నా.. పట్టించుకోవడం లేదు.
ఈ దశలో.. బలగం లాంటి సినిమాకు థియేటర్లు నిండడం చిన్న సినిమాలకు సానుకూల అంశం. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమాకి కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈనెల 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు 20 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదు. కానీ.. దిల్ రాజు తన ప్రయత్నాలు మానలేదు. ఈ సినిమాకి గట్టి ప్రచారం కల్పించారు. రెండో రోజు, మూడో రోజు వసూళ్లు బాగా పెరిగాయి. ఈ వారం బాక్సాఫీసు దగ్గర పెద్దగా సినిమాల హడావుడి లేదు. అది బలగంకి కలిసొచ్చింది. సోమ, మంగళవారాలు కొన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలక్షన్లతో నడిచాయి. ఇది.. ఈ సినిమాకి ప్లస్ పాయింట్. నిజానికి బలగం పెట్టుబడి ఆ సినిమా ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చేశాయి. థియేటర్ నుంచి ఎంతొచ్చినా లాభమే అనుకొన్నారు. థియేటర్ల నుంచి రాకపోయినా ఫర్వాలేదు అనుకొన్నారు. అలాంటి దశలో థియేటర్ల నుంచి కూడా ఆదాయం రావడంతో దిల్ రాజు వ్యూహం ఫలించినట్టైంది. చిన్న సినిమాని తన భుజాలపై వేసుకొని, గట్టి ప్రచారం చేయడం... కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్లని ప్రమోషన్లలో వాడుకోవడం, ప్రివ్యూలు వేయడం.. ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. అందుకే థియేటర్ నుంచి కూడా ఊహించని రెవిన్యూ వస్తోంది.