బాక్సాఫీసు దగ్గర పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత పెద్ద సినిమా వచ్చినా, పెద్ద పెద్ద స్టార్లు కనిపించినా, థియేటర్‌కి వెళ్లడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఓటీటీల్లో వినోదం అందుబాటులో ఉండడం ఒక కారణమైతే.... టికెట్ రేట్లు పెరిగిపోవడం కూడా ప్రేక్షకుల అనాసక్తికి మరో కారణంగా కనిపిస్తోంది. అందుకే... ఎలాగైనా ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో టికెట్ రేట్లు తగ్గించేస్తున్నారు నిర్మాతలు. తాజాగా దిల్ రాజు కూడా ఇదే నిర్ణయం తీసుకొన్నారు. `థ్యాంక్యూ` చిత్రానికి టికెట్ రేట్లు భారీగా తగ్గించామని ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్ లో రూ.100 కే పరిమితం చేశామని, దీనికి జీఎస్‌టీ అధికమని చెప్పారు.
అయితే ఇప్పుడు ఆన్ లైన్‌లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తీరా చూస్తే.. పెరిగిన రేట్లే కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ 250 రూ. ఉంటే సింగిల్ స్క్రీన్ లో రూ.150పైనే ఉంది. టికెట్ రేట్లు తగ్గించామని చెప్పి, పాత రేట్లే పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎఫ్ 3 సినిమా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిందే. ఆ సినిమాకి రేట్లు తగ్గించారు. కానీ థ్యాంక్యూ విషయంలో మాత్రం దిల్ రాజు మాటపై నిలబడడం లేదు. మరి... రేట్లు ఇలా ఉంటే. జనాలు థియేటర్లకు రావడం అనుమానమే.