దిల్ రాజు మార్కెట్ స్ట్రాటజీ తిరుగుండదు. ఏ సినిమాలో ఎంత విషయం ఉంటుందో ఆయనకు ముందే తెలిసిపోతుంది. అందుకే విజయవంతమైన పంపిణీదారుడిగా మారారు. నిర్మాతగానూ అదే చురుకుదనం చూపించారు. అందుకే విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు. దిల్‌రాజు అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ముఖ్యంగా డిస్టిబ్యూటర్‌గా. ఆయన ఓ సినిమా కొన్నాడంటే.. ఎంతో ముందస్తు కసరత్తు జరిగి ఉంటుంది. తాజాగా ఆయన ఆర్.ఆర్.ఆర్ నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారు. ఏకంగా 75 కోట్లకు ఆ సినిమా కొన్నారాయన. ఇది ఆల్ టైమ్ రికార్డు.
అయితే.. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలో తొందరపడ్డానేమో అని దిల్ రాజు ఆందోళన చెందుతున్నాడని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ బాగా ఆలస్యం అవుతోంది. జనవరి 8న రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా, ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన సమయానికి ఈ చిత్రాన్ని విడుదల చేయడం కష్టం అనిపిస్తోంది. ఒక వేళ వచ్చినా 75 కోట్లు రికవరీ చేయగలదన్న నమ్మకం దిల్ రాజుకి కలగడం లేదట. అందుకే నైజాం రైట్స్ ని వదలుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై అతి తొందరలో నిర్మాత డి.వి.వి దానయ్యతో దిల్ రాజు మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ దిల్ రాజు ఈ హక్కుల్ని వదులుకుంటే.. ఎగరేసుకుపోవడానికి చాలామంది పంపిణీదారులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే.. 75 కోట్లు వెచ్చించడం కష్టం. ఒకవేళ తీసుకున్నా - ఇద్దరుముగ్గురు సిండికేట్‌గా మారి హక్కుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.