మహా నగరాలలో మల్టీప్లెక్సుల సంస్క్రృతి బాగా పెరిగిపోయింది. సింగిల్ థియేటర్లు ఎక్కడో గానీ కనిపించడం లేదు. షాపింగు మాల్స్ లో మల్టీప్లెక్సులు వెలుస్తున్నాయి. షాపింగు - సినిమా.. ఇలా రెండూ ఒకేచోట అయిపోతున్నాయి. క్రమంగా మల్టీప్లెక్సులకు ప్రేక్షకులూ అలవాటు పడుతున్నారు. అయితే కరోనా ఎఫెక్టు ఇప్పుడు మల్టీప్లెక్సులపై విపరీతంగా పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో దేశమంతా లాక్ డౌన్ అయిపోయింది. అంతకు ముందే థియేటర్లు బంద్ అయ్యాయి. దాదాపు నెల రోజుల నుంచీ మల్టీప్లెక్స్ లలో బొమ్మ ఆడడం లేదు. దాంతో దేశంలోని మల్టీప్లెక్సులన్నీ నష్టాల బాట పట్టాయి. సింగిల్ థియేటర్ కంటే మల్టీప్లెక్స్ నిర్వహణ వ్యయం చాలా కష్టం.
దాదాపుగా ఆయా స్థలాలన్నీ లీజుకు తీసుకున్నవే. వ్యాపారం జరిగినా, లేకపోయినా లీజు ప్రకారం అద్దె చెల్లించాల్సిందే. మల్టీప్లెక్సులో బొమ్మ నడుస్తున్నా, లేకున్నా.. కొంతమందైనా సిబ్బంది ఉండాలి. థియేటర్ నిర్వహణ చూసుకోవాలి. వాళ్లందరికీ ఇప్పుడు పనుల్లేకుండానే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇదే పరిస్థితి మరో నెల రోజులు కొనసాగితే యాజమాన్యాలు ఠారెత్తిపోవడం ఖాయం. అందుకే పీవీఆర్ లాంటి సంస్థలు ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాయి. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు లీజు ప్రకారం అద్దెలు చెల్లించకూడదని భావిస్తున్నాయి. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి సైతం రెడీ అంటున్నాయి. పీవీఆర్ ఈ విషయంలో ముందే ఓ నిర్ణయానికి వచ్చేసిందని సమాచారం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ పీవీఆర్ మల్టీప్లెక్సులు ఉన్నాయి. అవన్నీ లీజుకు తీసుకున్నవే. లీజు ప్రకారం నెలవారీ అద్దె చెల్లించాలి.
లాక్ డౌన్ వల్ల సినిమాలు నడవలేదని చెప్పి, ఆ అద్దె నుంచి తప్పించుకోవాలని పీవీఆర్ యాజమాన్యం భావిస్తుంది. మరి.. చట్టాలు అందుకు ఒప్పుకుంటాయా, లేదా? అనేది చూడాలి. పీవీఆర్ వల్ల మిగిలిన మల్టీప్లెక్సులూ ఇదే బాట పట్టే ఛాన్సుంది. లీజు ఎగ్గొటితే ఫర్వాలేదు. కానీ ఆయా మల్టీప్లెక్సులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇలా కాకూడదు. వాళ్లకైనా జీతాలు చెల్లిస్తారో, లేదో?