ఈనెల 29న ఆచార్య వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతోంది. అయితే నైజాంలో మాత్రం థియేటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కొన్ని థియేటర్లలో ఇంకా ఆడుతోంది. దానికి తోడు కేజీఎఫ్ 2 రన్ కూడా బాగానే ఉంది. పెద్ద సినిమా వచ్చినప్పుడు గత వారంలో ఆడుతున్న సినిమాలు సైడ్ అయిపోతాయి. కానీ ఈసారి అలా జరగడం లేదు. ఎక్కువ థియేటర్లలో ఈ రెండు సినిమాలే కనిపిస్తున్నాయి. దాంతో ఆచార్యకు థియేటర్లు కావల్సిన సంఖ్యలో కనిపించడం లేదు.
దానికి కారణం... దిల్ రాజు. ఆయన చేతిలో ఎక్కువ థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల్ని నైజాంలో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆచార్య హక్కులు మాత్రం ఆయనకు దొరకలేదు. దాంతో.. ఆచార్యకు థియేటర్లు లేకుండా చేశాడు దిల్ రాజు. దాంతో చిరు ఫ్యాన్స్ దిల్ రాజుపై గరమ్ గరమ్ గా ఉన్నారు. చిరుతో దిల్ రాజుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు కూడా. అయినా సరే, థియేటర్లన్నీ చేతిలో పెట్టుకుని, ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు. సినిమా విడుదలకు మరో రెండు రోజులే టైమ్ ఉంది. ఈలోగా దిల్ రాజుని లైన్‌లో పెట్టాలని మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.