స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' విజయంతో సూపర్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందే దిల్ రాజు బ్యానర్ లో 'ఐకాన్' చిత్రంలో నటించేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే బన్నీ ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్. సుకుమార్ తో 'పుష్ప', తర్వాత కొరటాల శివ తో #AA21 లైన్ లో పెట్టారు బన్నీ. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట.
దీంతో 'ఐకాన్' సినిమా కోసం దిల్ రాజు మరో స్టార్ హీరోను ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రామ్ చరణ్ కు ప్రస్తుతం చేస్తున్న 'RRR' తప్ప మరే ఇతర కమిట్మెంట్ లు కూడా లేవు. దీంతో ఈ ప్రాజెక్టు సెట్ చేసేందుకు దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుతోంది. ఒకవేళ చరణ్ ఓకే అంటే తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు స్క్రిప్టులో మార్పులు-చేర్పులు చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే చరణ్ ఈ ప్రాజెక్టు ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.
ఇదిలా ఉంటే వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'ఐకాన్' ను పట్టాలెక్కించే ప్రయత్నాలలో ఉంటారట.