నైజాంలో దిల్ రాజుదే హవా. సినిమా కొనాలన్నా, అమ్మాలన్నా దిల్ రాజు ఆశీస్సులు ఉండాలి. పెద్ద సినిమాలకు నైజంలో కేరాఫ్ అడ్రస్స్ దిల్ రాజు. అయితే ఆ మధ్య కొన్నాళ్లు వరంగల్ శ్రీను అనే పంపిణీదారుడు పెద్ద సినిమాన్నీ లాక్కుని దిల్ రాజు ఆధిపత్యానికి గండి కొట్టాడు. దాంతో నైజాంలో... దిల్ రాజు ప్రభావం, ప్రాబల్యం తగ్గిందా? అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే.. దిల్ రాజు మళ్లీ సునామీలా విరుచుకుపడిపోయి... ఈ కింగ్ డమ్ తనదే అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఆర్.ఆర్.ఆర్ నైజాం రైట్స్ దిల్ రాజు రూ.75 కోట్లకు సొంతం చేసుకుని, ఇప్పుడు భారీ లాభాల్ని గడిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కనీసం 30 కోట్ల లాభం వస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పుడు ఈనెలలోనే రాబోతున్న బీస్ట్, కేజీఎఫ్ 2 నైజాం రైట్స్ కూడా దిల్ రాజునే దక్కించుకున్నాడు. ఇవి రెండూ పెద్ద సినిమాలే. భారీ అంచనాలున్న చిత్రాలు. విపరీతమైన పోటీలో కూడా.. ఈ రైట్స్ దిల్ రాజు చేతిలోకి వచ్చేశాయి. 13న బీస్ట్, 14న కేజీఎఫ్ 2 వస్తున్నాయి. అప్పటికే... ఆర్.ఆర్.ఆర్ కూడా కొన్ని ధియేటర్లలో ఉంటుంది. అంటే నైజాంలో 13 నుంచి ఏ ధియేటర్లో టికెట్ తెగినా.. ఆ డబ్బులన్నీ దిల్ రాజు ఖాతాలోకి వెళ్తాయన్నమాట.