టాలీవుడ్ లో ది బెస్ట్ ఫిల్మ్ మేకర్ ఎవరంటే... దిల్ రాజు పేరు నిర్మొహమాటంగా చెప్పొచ్చు. టాలెంట్ ఎక్కడున్నా పట్టేస్తారాయన. అందుకే ఆయన కాంపౌండ్ లో రచయితలు, దర్శకులు... చాలా మందే ఉంటారు. ఒక్కసారి ఆయన కాంపౌండ్ లోకి అడుగుపెట్టారంటే, బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. వేణు శ్రీరామ్ కూడా ఆ కాంపౌండ్ వ్యక్తే. వేణు నుంచి వచ్చిన సినిమాలన్నింటికీ దిల్ రాజునే నిర్మాత. తాజాగా వకీల్ సాబ్ తో ఆ బ్యానర్ కి మరో పెద్ద హిట్టు ఇచ్చాడు వేణు.
అయితే.. వేణు శ్రీరామ్ కీ, దిల్ రాజుకీ మధ్య విబేధాలు వచ్చాయని, దిల్ రాజు కాంపౌండ్ నుంచి వేణు బయటకు వెళ్లిపోయాడని ప్రచారం జరిగింది. వేణుకి సరైన పారితోషికం ఇవ్వట్లేదని, వకీల్ సాబ్ తో వంద కోట్ల సినిమా ఇచ్చినా, పారితోషికం విషయంలో వేణు శ్రీరామ్ కి అన్యాయం జరిగిందని తెలుస్తోంది. ఆ కారణంతోనే.. వేణు శ్రీరామ్ అలిగాడని సమాచారం. నిజానికి ఐకాన్ అనే ప్రాజెక్టు.. దిల్ రాజు కాంపౌండ్ లోనే జరగాల్సివుంది. ఆ ప్రాజెక్టుకి నిర్మాతలు మారారని కూడా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఐకాన్ నిర్మాత కూడా దిల్ రాజు అని వార్తలొస్తున్నాయి. ఈ కాంబోలో త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది.
ఐకాన్ మళ్లీ దిల్ రాజు చేతికే రావడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమాకి గానూ.. వేణు శ్రీరామ్ కి దిల్ రాజు భారీ పారితోషికాన్ని ముట్టజెప్పాడట. ఇంత వరకూ.. నెలవారీ జీతంపై సినిమాలు తీసిన వేణుకి ఒకేసారి భారీ మొత్తంలో పారితోషికం కట్టబెట్టాడట. ఇప్పటికే రూ.3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడని, మరో మూడు కోట్లు సినిమా పూర్తయిన తరవాత ఇస్తాడని, అంటే ఈ సినిమాకి వేణు శ్రీరామ్ ఏకంగా ఆరు కోట్లు అందుకోబోతున్నాడని, అందుకే వేణు - దిల్ రాజు మధ్య గ్యాప్ చెరిగిపోయిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.