లాక్ డౌన్ వల్ల సినిమాలు ఆగిపోయాయి. ఇక దర్శకులంతా ఖాళీ అనుకుంటున్నారు గానీ, ఒక్కో ప్రాజెక్టుకి డైరెక్టరే దొరకడం లేదు. మలయాళ చిత్రం `అయ్యప్పయుమ్ కోషియమ్` విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమాని రీమేక్ చేయాలని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఎప్పుడో అనుకుంది. అయితే సరైన దర్శకుడు మాత్రం దొరకడం లేదు. సాగర్ చంద్రతో తెలుగు వెర్షన్ కి సంబంధించిన స్క్రిప్టు తయారు చేయించేశారు. కానీ అనూహ్యంగా సాగర్ చంద్ర ఈ ప్రాజెక్టు నంచి తప్పుకున్నాడు.
ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. ఎట్టకేలకు ఈ సినిమాకి దర్శకుడు ఖాయం అయిపోయాడని సమాచారం. `జై లవకుశ`, `వెంకీ మామ`లతో వరుస హిట్లు కొట్టిన బాబిని ఈ సినిమాకి దర్శకుడిగా ఖాయం చేశారని తెలుస్తోంది. సాగర్ చంద్ర ఇచ్చిన స్క్రిప్టుకి బాబి తనదైన మార్పులు చేర్పులూ చేస్తున్నాడని, త్వరలోనే స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వస్తాయని సమాచారం. రవితేజ - రానాలతో గానీ, పవన్ కల్యాణ్ - రానాలతో గానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. దర్శకుడు ఖాయం కాలేదన్న కారణంతో పవన్ ఈ సినిమాని వదులుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బాబి గనుక ఎంటర్ అయితే.. పవన్ కూడా సై అంటాడని సితార ఎంటర్టైన్మెంట్స్ నమ్ముతోంది.