`జీన్స్` సినిమా గుర్తుంది కదా. 1998లో విడుదలైంది. శంకర్ చేసిన అద్భుతాల్లో ఒకటి. అందులో ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించారు. ఆ తరవాత వాళ్లిద్దరూ ఒకే తెరపై కనిపించింది లేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఓ సినిమాలో కలసి నటించబోతున్నట్టు టాక్. అదీ.. ఓ రీమేక్ సినిమాలో. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం `అంధాధూన్`. తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని తమిళంలోనూ రీమేక్ చేస్తున్నారు. కథానాయకుడిగా ప్రశాంత్ ని ఎంచుకున్నారు. హిందీలో టబు పోషించిన పాత్రకు మంచి స్పందన, గుర్తింపు వచ్చింది. ఆ పాత్రని తెలుగులో తమన్నా చేస్తోంది. తమిళంలో.. ఐశ్వర్యరాయ్ పేరుని పరిశీలిస్తున్నారు. ఐశ్వర్యతో చిత్రబృందం సంప్రదింపులు కూడా మొదలెట్టిందని, అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాత రెడీ అయ్యారని టాక్. ఐశ్వర్య కూడా ఈ రీమేక్ లో నటించడానికి ఉత్సాహం చూపిస్తోందట. ఐశ్వర్య గనుక ఓకే అంటే.. తమిళంలో ఈ రీమేక్కీ మంచి క్రేజ్ వచ్చినట్టే.