జాతీయ అవార్డులలో `జెర్సీ` తన తడాఖా చూపించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలికి పురస్కారం లభించింది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వబోతోంది. అక్కడ కూడా `జెర్సీ` తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది. అయితే.. జెర్సీ విషయంలో చిత్రబృందానికి ఓ అసంతృప్తి ఉందట. ఈ సినిమాలో నటనకు గానూ.. నానికి జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కలేదని చిత్రబృందం ఫీలవుతున్నట్టు అనిపిస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది.
``నానికి ఈ సినిమాతో జాతీయ అవార్డు వస్తుందనుకున్నాం. ఆయనకు అవార్డు వచ్చుంటే ఇంకా బాగుండేది. `జెర్సీ` ప్రయాణం పరిపూర్ణమయ్యేది`` అని తన మనసులోని మాట బయటపెట్టాడు గౌతమ్. కరోనా సమయంలో... ఈ సినిమా గురించి నాని - గౌతమ్ ల మధ్య చాలా చర్చే జరిగిందట. కరోనా వల్ల ఈ సినిమాకు రావాల్సిన అవార్డులు రాకుండా పోయాయని బాధ పడ్డార్ట. సాధారణంగా యేడాదంతా ఎక్కడో చోట.. చిత్రోత్సవాలు జరుగుతుంటాయి. అలాంటి చిత్రోత్సవాలకు సినిమాలు పంపడం, అవార్డు చిత్రాల జాబితాలో పేరు చూసుకోవడం గొప్ప అనుభూతి. దాన్ని `జెర్సీ` మిస్సయ్యింది. అయినా ఇప్పుడు జాతీయ అవార్డుల లో రెండు గెలుచుకుంది. దాంతో ఆ లోటు కాస్త తీరినట్టైంది.