డీజే... - దువ్వాడ జగన్నాథమ్ తరవాత హరీష్ శంకర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 'దాగుడు మూతలు' అనే స్క్రిప్టు దిల్ రాజు కాంపౌండ్ ఓకే చేసినా - ఈ కథలో నటించడానికి హీరోలెవరూ ముందుకు రాలేదు. దాంతో... 'దాగుడు మూతలు' స్క్రిప్టు పక్కన పెట్టేసిన హరీష్... 'జిగడ్తాండ అనే తమిళ రీమేక్‌పై దృష్టి పెట్టాడు. 14 రీల్స్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాలో కథానాయకుడితో పాటు ప్రతినాయకుడి పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. ప్రతి నాయకుడి పాత్రలో వరుణ్‌తేజ్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. మరిప్పుడు సిద్దార్థ్ పాత్రకు గానూ ఎవరిని తీసుకుంటున్నారన్నదే ప్రశ్న. ఇప్పుడు దానికీ సమాధానం దొరికేసింది. నాగశౌర్యని కథానాయకుడిగా ఎంచుకున్నారని సమాచారం.
`నర్తనశాల` డిజాస్టర్ తరవాత.. నాగశౌర్య ఏ కథనీ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఓ మినిమం గ్యారెంటీ సినిమా చేయాలనుకుంటున్నాడు. రీమేక్ కథ కాబట్టి ఆ గ్యారెంటీ ఉంటుంది. దానికి తోడు పేరున్న బ్యానర్ ఆయె. అందుకే... ఈ సినిమాలో నటించడానికి నాగశౌర్య ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
ఇందులో కథానాయిక గా రష్మికని ఎంచుకున్నారని సమాచారం. 'ఛలో'తో శౌర్య - రష్మికల జంట ఆకట్టుకుంది. మరోసారి ఇందులో మ్యాజిక్ చేయబోతోందన్నమాట. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తారు.