2015లో వచ్చిన సినిమా.. 'శ్రీమంతుడు'. అయితే అప్పుడు మొదలైన కాపీ గొడవ కొరటాల శివని ఇప్పటి వరకూ వెంటాడుతూనే ఉంది. స్వాతి మ్యాగజైన్‌లో వచ్చిన తన కథని కాపీ కొట్టి, శ్రీమంతుడు సినిమా తీశారని అప్పట్లో శరత్ చంద్ర అనే రచయిత కోర్టులో కేసు వేశారు. ఆ కేసుని అప్పట్లో కొరటాల శివ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే కొరటాల మెడకు చిక్కుకొంది.
ఈ కేసుపై క్రింది కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేయాలంటూ - కొరటాల శివ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు యధావిధిగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. ఈమేరకు కొరటాల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి తప్పు చేశానని ఒప్పుకొని, శిక్షని స్వీకరించడం, మరోటి.. కోర్టు బయటే.. సెటిల్మెంట్ చేసుకోవడం. కొరటాలకు సెటిల్‌మెంట్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు 'దేవర' సినిమా షూటింగ్ తో కొరటాల బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్ మధ్యలో.. ఇది కొత్త తలనొప్పి. కోర్టులు చుట్టూ తిరగడం కంటే... సెటిల్మెంట్ చేసుకొంటే, ఇకతో కాపీ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టొచ్చు. కానీ కొరటాల మైండ్ సెట్ వేరు. సెటిల్మెంట్ కి దిగితే - తప్పు చేశానని ఒప్పుకోవడమే అవుతుంది. అది కొరటాలకు ఇష్టం లేదు. అలాగని ఇప్పుడు ఈ కేసుపై కొత్తగా పోరాటం చేయడానికి ఏం లేదు. మరి.. కొరటాల నెక్ట్స్ స్టెప్ ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.