ఈ సంక్రాంతి బరిలో 5 సినిమాలు ఉన్నప్పుడు, అందులోంచి ఒక సినిమా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు... ఈగల్ వెనక్కి వెళ్లింది. మిగిలిన 4 సినిమాలకూ దారి ఇచ్చింది. అప్పుడే... ఈగల్ కి సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఛాంబర్ మాట ఇచ్చింది. అయితే ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతోంది.
ఫిబ్రవరి 9న `ఈగల్` రిలీజ్‌కి రెడీ అయ్యింది. అదే రోజున మరో 3 సినిమాలు రిలీజ్ డేట్ డిక్లేర్ చేశాయి. ఊరి పేరు భైవరకోన, యాత్ర 2, లాల్ సలామ్ విడుదలకు రెడీ అయ్యాయి. ఇందులోంచి ఇప్పుడు ఊరి పేరు భైవరకోన ఒక్కటే వాయిదా పడింది. అంటే మిగిలిన రెండు సినిమాలూ వచ్చేస్తున్నాయన్నమాట. అంటే.. ఈగల్ కి మాట ఇచ్చినట్టు సోలో రిలీజ్ డేట్ దొరకలేదు. యాత్ర 2 నిర్మాత.. తమ సినిమాని వాయిదా వేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు.
ఇక లాల్ సలామ్ డబ్బింగ్ సినిమా. దాన్ని ఎలా ఆపాలో ఛాంబర్ కు అర్థం కావడం లేదు. ఈ రెండు సినిమాలతో ఈగల్ పోటీ పడాల్సిందే. యాత్ర 2తో ఈగల్ కి పెద్దగా ఇబ్బంది లేకపోవొచ్చు. కానీ లాల్ సలామ్ అలా కాదు. అది డబ్బింగ్ సినిమా అయినా, రజనీకాంత్ ఉన్నాడు. కాబట్టి అంతో ఇంతో పోటీ ఉంటుంది. ఫిబ్రవరి 9 దాటితే, ఈగల్ కి మరో మంచి డేట్ దొరకడం కష్టం. అందుకే... పోటీ ఉన్నా దిగక తప్పడం లేదు. అదే సంక్రాంతికి వచ్చి ఉంటే, థియేటర్లు తక్కువ ఉన్నా, వసూళ్లు బాగుండేవి కదా, అనవసరంగా వాయిదా వేసుకొన్నాం అని ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భావిస్తోందట.