ఓటీటీ వేదికల వల్ల దర్శకులు మరింత బిజీ అయిపోతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లూ, వెబ్ మూవీలూ అంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు చాలామంది... ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వైపు ఆకర్షితులవుతున్నారు. వాళ్లలో ఇప్పుడు క్రిష్ కూడా చేరాడు. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన `లస్ట్ స్టోరీస్` మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు `లవ్ స్టోరీస్` వెబ్ సిరీస్ ని రూపొందించే పనిలో ఉంది.
సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ రూపొందించాలన్నది నెట్ ఫ్లిక్స్ ప్లాన్. అందులో భాగంగా తెలుగు వెబ్ సిరీస్ కోసం క్రిష్‌ని ఎంచుకుంది. క్రిష్ చెప్పిన ప్రేమకథ.. నెట్ ఫ్లిక్స్‌కి నచ్చిందని, దాన్ని ఓకే చేసిందని టాక్. ఇప్పటికే నందిని రెడ్డి, శివ నిర్వాణ, అజయ్ భూపతి నెట్ ఫ్లిక్స్‌కి తమ కథలు వినిపించారు. ఈ నాలుగు కథల్నీ ఓ వెబ్ సిరీస్ గా రూపొందించనుంది నెట్ ఫ్లిక్స్. త్వరలోనే ఆవివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు క్రిష్. ఆ తరవాత పవన్ తో ఓ సినిమా చేయాల్సివుంది. ఇవి అయ్యాకే.. `లవ్ స్టోరీస్` వెబ్ సిరీస్‌పై ఫోకస్ పెడతాడట క్రిష్.