మారుతి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. `ప్రతిరోజూ పండగే` లాంటి సూపర్ హిట్ తరవాత కూడా ఆయన సినిమా ఇప్పటి వరకూ మొదలవ్వలేదు. మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినా, ఇంకా జరుగుతున్నా అవేం ఓ కొలిక్కి రాలేదు. రామ్ తో మారుతి ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కథ నచ్చకపోవడం వల్ల, ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఆ తరవాత.. రవితేజ లైన్ లోకి వచ్చాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. త్వరలోనే షూటింగ్ మొదలు కావాలి.
కానీ.. ఈ ప్రాజెక్టు కూడా ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. రవితేజ కూడా మారుతికి హ్యాండిచ్చాడని, ఈ సినిమా చేయడం లేదని చెప్పేశాడని టాక్ వినిపిస్తోంది. పారితోషికం విషయంలో పేచీలు రావడంతో రవితేజ `నో` అన్నాడని సమాచారం. అయితే మారుతి ఇప్పుడు బెంగ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్ట్రనేటివ్ గా గోపీచంద్ ని లైన్లో పెట్టుకున్నాడట. రవితేజ నో చెప్పిన పక్షంలో గోపీచంద్ తో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. మరి గోపీచంద్ ఏమంటాడో చూడాలి.