శంకర్.. దేశం మొత్తం గర్వించదగిన దర్శకుడు. తన కథలు, ఆలోచనలు, తీసే సినిమాలూ అన్నీ ఓ స్థాయిలో ఉంటాయి. మధ్యలో ఒకట్రెండు సినిమాలూ అటూ ఇటూ అయినా, తన సినిమా అంటే ప్రేక్షకులకు ఇప్పటికీ ఆసక్తే. ప్రస్తుతం శంకర్ దృష్టంతా `భారతీయుడు 2`పైనే ఉంది. ఈసినిమాని ఎలాగైనా హిట్ చేసి, తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. అయితే.. ఏ ముహూర్తంలో ఈ సినిమాని మొదలెట్టాడో గానీ, అన్నీ ఆటంకాలే.
ముందు సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాతలతో గొడవైంది. సినిమా మధ్యలో ఆగిపోవాల్సిన పరిస్థితిలో మళ్లీ మొదలైంది. ఆ తవరాత.. ఇండియన్ 2 సెట్లో భారీ ప్రమాదం జరిగి సహాయ దర్శకులు, క్రూలలో కొంతమంది గాయపడ్డారు. ఇంకొంతమంది చనిపోయారు. శంకర్, కాజల్.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదంతా అయ్యాక మళ్లీ షూటింగ్ మొదలెడదామంటే కరోనా వచ్చింది.
కరోనా ప్రభావం తగ్గి, షూటింగులు మొదలవుతుండగా `భారతీయుడు` మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. ఈసినిమా బడ్జెట్ విషయంలో శంకర్‌కీ, నిర్మాతలకూ మళ్లీ గొడవ మొదలెందని టాక్. బడ్జెట్ తగ్గించుకుంటే తప్ప సినిమా తీయలేమని నిర్మాతలు చేతులెత్తేశార్ట. శంకర్ కూడా విసిగి వేసారిపోయాడని సమాచారం. `ఈ సినిమా మొదలెడితే ఉంటా. లేదంటే మరో ప్రాజెక్టులోకి వెళ్లిపోతా` అని ఖరాఖండీగా చెప్పేశాడట. అయితే కమల్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా పూర్తి చేయాల్సిందే అంటున్నాడట. అటు కమల్ కూ, ఇటు నిర్మాతలకూ మధ్య శంకర్ నలిగిపోతున్నాడని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో చిత్రబృందంతో శంకర్‌కి ఓ కీలకమైన మీటింగ్ ఉందని సమాచారం. ఆ మీటింగ్ లో ఈ సినిమా చేయాలా, వద్దా అనే విషయంలో శంకర్ ఓ నిర్ణయానికి వస్తాడని తెలుస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.