తీసిన రెండు సినిమాలతోనే తన మార్క్ ఏమిటో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. బోల్డ్, ఓవర్ ద టాప్, రా&రస్టిక్.. ఇలా ఎలాంటి పేర్లయినా పెట్టుకోనివ్వండి. ఇవన్నీ కలిపి ఓ కొత్త పేరు సృష్టించుకోండి. ఏదైనా సరే - సందీప్ మార్క్ సుస్పస్టం. అర్జున్ రెడ్డి చూసి కళ్లు పెద్దవి చూసుకొన్న విమర్శకులు.. ఇప్పుడు అందుకు వందింతలున్న `యానిమల్` చూసి అవే కళ్లతో నిప్పులు చెరుగుతున్నారు. సందీప్ రెడ్డి వంగా గీత దాటేశాడని, కేవలం కుర్రకారుని కిర్రెక్కించే సన్నివేశాలతో సొమ్ములు చేసుకొంటున్నాడని... ఇలా రకరకాలుగా విరుచుకుపడిపోతున్నారు.
భారతీయ సినిమాని తుంగలోకి తొక్కేసేందుకే అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాల్ని తీశాడని ఇలా రకరకాల నెగిటీవ్ కామెంట్స్. అయితే ఇవేం 'యానిమల్' విజయాన్ని ఆపలేకపోయాయి. సరికదా... రికార్డు స్థాయి వసూళ్లని కట్టబెట్టాయి. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ విమర్శల్ని లైట్ తీసుకొన్నాడు. అసలు బాలీవుడ్ లో ఎవరికీ రివ్యూలు రాయడం రాదని, సినిమాని చూడ్డం తెలీదని - తనదైన శైలిలో ఘాటైన విమర్శలు చేశాడు. ఎడిటింగ్ గురించో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించో, టెక్నికల్ వాల్యూస్ గురించో... మాడ్లాడే స్థాయి రివ్యూ రైటర్లకు ఇంకా రాలేదని గట్టిగానే సమాధానం ఇచ్చాడు.
సినిమాల వల్ల యువతరం తప్పుదోవ పడుతుందన్న వాదననీ కొట్టి పడేశాడు. సినిమా ఏం పాఠశాల కాదని, గురువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఏం నేర్చుకోనివాళ్లు సినిమా చూసి చెడిపోతారనుకోవడం ఓ అపోహ మాత్రమే అని అన్నాడు. ఓ సినిమా హిట్టూ, ఫ్లాపులకు కొలమానం కేవలం వసూళ్లే అని, రూ.100 కోట్లతో తీసిన సినిమాకి, రూ,130 కోట్లు వస్తే అది హిట్టు కింద లెక్క అని, తన సినిమాకి రూ.350 కోట్లో వస్తే... ఫ్లాప్ అని తేల్చేసేవారని, ఆ అంకె దాటింది కాబట్టి ఎవరూ ఏం అనలేకపోతున్నారని రివ్యూలపై తనదైన శైలిలో ఓ రివ్యూ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి.