సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ లాంటి విభిన్నచిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన దర్శకుడు సూర్య కిరణ్ ఈ రోజు పరమపదించారు. సూర్య కిరణ్ సుమంత్ నటించిన 'సత్యం' సినిమాతో దర్శకునిగా సినీ ప్రయాణం మొదలు పెట్టారు. దర్శకుడు కాకముందే సూర్య కిరణ్ 'మాస్టర్' సురేష్ అనే పేరుతో బాలనటుడిగా రెండు వందలకు పైగా సినిమాలు చేశారు. ఆ తర్వాత సహాయ నటుడిగా నటించారు. బాల నటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు పురస్కారాలు, దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు.
తరవాత హీరోయిన్ కళ్యాణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత విభేదాల కారణంగా వీరిద్దరూ 2016 లో విడాకులు తీసుకున్నారు. ఆ డిప్రెషన్ తో ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. కళ్యాణి తన లైఫ్‌లో లేకపోవడం తీరని లోటే అంటూ పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు సూర్యకిరణ్. కళ్యాణి అమ్మ తరువాత అమ్మ అంటూ, ఈ జన్మకి కళ్యాణే నా భార్య’ అని పలుమార్లు వెల్లడించారు సూర్య కిరణ్.
అనారోగ్యం కారణంగా సూర్య కిరణ్ మృతి చెందినట్లు సమాచారం. రెండు నెలలుగా కామెర్లతో, అనారోగ్య సమస్యలతో సూర్య కిరణ్ ఇబ్బంది పడుతున్నారట. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా చిన్న వయసులో సూర్య కిరణ్ మరణించడంతో చిత్రసీమలో పలువురు దిగ్బ్రాంతికి గురి అయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.