సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా మంచి పాత్రలను ఎంచుకుంటున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ రోల్ ఇలాంటి తేడాల్లేకుండ, కథ నచ్చితే చాలు. వెంటనే ఓకే చేసేస్తాడు ఆది పినిశెట్టి. చిన్న పాత్రయినా, తెరపై ఆది అప్పియరెన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.
మొన్న చేసిన 'రంగస్థలం'లో కుమార్‌బాబు పాత్రైనా, 'నీవెవరో'లో హీరోగా అయినా, నేడు 'యూ టర్న్'లో పోలీసాఫీసర్ పాత్రైనా ప్రాణం పెట్టి నటిస్తాడు ఆది పినిశెట్టి. అయితే ఎందుకలా విభిన్న పాత్రలను ఎంచుకుంటున్నారని ఆదిని అడిగితే, రొటీన్ స్టఫ్ జనానికి నచ్చట్లేదు కదా. అందుకే డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాను అని ఆది సమాధానమిచ్చాడు.
తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూనే తెలుగులోనూ విభిన్న క్యారెక్టర్లు పోషిస్తున్నాడు ఈ అచ్చమైన తెలుగు కుర్రాడు. డిఫరెంట్ స్టోరీస్ తన వద్దకు వచ్చినప్పుడు ఎప్పుడూ నటించడానికి సిద్ధంగా ఉంటానని చెబుతున్నాడు. తెలుగులో తొలిసారి పూర్తి స్థాయిలో హీరోగా నటించిన సినిమా 'నీవెవరో'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేం కానీ, ఓ మోస్తరు పోజిటివ్ టాక్‌ని సంపాదించింది ఈ సినిమా. తాప్సీ, రితికాసింగ్ హీరోయిన్లుగా నటించారు.
ఇకపోతే తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'యూటర్న్'లో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది పినిశెట్టి పాత్రకు మంచి ఆదరణ దక్కింది. సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో ఆదితో పాటు, మరో యంగ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, భూమిక ఇతర కీలకపాత్రలు పోషించారు.