బిగ్ బాస్ అనే రియాలిటీ షో దేశవ్యాప్తంగా అనేక బాషలలో రూపొందుతూ వీక్షకుల మన్ననలు పొందుతూనే ఉంది. ఇక ఈ షోలో పాల్గోనేవారి సహనానికి పరీక్ష పెట్టేలా ఉండే టాస్క్ లు పెట్టడం, తద్వారా వారు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనకి తెలుస్తుంటుంది.
ఈ పోటీలు కూడా ఎలాంటివి అంటే, వాటిలో ఇంటి సభ్యుల వ్యక్తిత్వం బయటపడగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు అంతలా పాపులారిటీని తెచ్చుకోగాలిగాయి. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న బిగ్ బాస్ ఈ వారం ఒక పెద్ద తప్పిదానికి పాల్పడ్డాడనే భావించాలి.
ఇంతకీ ఆ తప్పేంటంటే- ఇంటిలోని సభ్యులు ఇంటి నియమాలని పాటించని కారణంగా ఇంటిలో ఉన్న ఆరుగురు సభ్యులని ఈ వారం నామినేషన్లలో చేర్చాడు బిగ్ బాస్. ఇక దీనితో ఇంటిలో తమకి నచ్చేవారిని రక్షించుకునే క్రమంలో వీక్షకులు ఓటింగ్ చేయడం ప్రారంభించారు.
ఈ తరుణంలో “మీ ఇసుక జాగ్రత్త” టాస్క్ ని ఇంటి సభ్యులకి ఇచ్చి అందులో గెలిచిన వారికి ఈ వారం “ఇమ్యూనిటీ”ని ఇస్తాను అంటూ ప్రకటించాడు. ఇలా చేయడం వల్ల ఈ ఆరుగురి నుండి ఒకరు వీక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా నేరుగా ఆఖరి వారానికి వెళతారు. అయితే ఇప్పుడు అలా వెళ్ళే ఇంటి సభ్యుడికి ఒక వేళ వీక్షకులు వేసే ఓట్లలో చివరి స్థానం వాడై ఉంటే అతను రక్షింపబడతాడు.
ఉదాహరణకు నేటి రోజున సామ్రాట్-రోల్ రైడాలు బిగ్ బాస్ ఇమ్యూనిటీ కోసం పోటీ పడనున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఓటింగ్ పద్దతిలో చివరగా వచ్చి ఈ టాస్క్ గెలిస్తే అతను ఎలిమినేషన్ నుండి బయటపడతాడు. దీనితో రెండవ అతి తక్కువ ఓట్లు వచ్చిన సభ్యుడు ఇంటి నుండి పంపించే ఆవశ్యకత ఏర్పడుతుంది. ఒకవేళ అలానే గనుక చేస్తే అది అన్యాయమే అవుతుంది.
అసలు ఇంటి సభ్యులందరిని నామినేషన్లలో పెట్టేసాక మళ్ళీ ఇమ్యూనిటీ అనే అంశం తేవడం కచ్చితంగా బిగ్ బాస్ వైపు నుండి జరిగిన పెద్ద తప్పుగా భావించాలి.
కొసమెరుపు- ప్రతివారం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అన్న లెక్కలు మనకి చెప్పరు కాబట్టి, వారికి నచ్చని వారు ఈ వారాంతం వెళ్ళిపోతారు. ఇక బిగ్ బాస్ నుండి దొర్లిన ఈ భారీ తప్పుకి ఎవరో ఒక ఇంటి సభ్యుడు/సభ్యురాలు భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పొచ్చు.